My Dear Donga Review : ‘మై డియర్ దొంగ’ రివ్యూ.. అమ్మాయికి దొంగ నచ్చితే..

'మై డియర్ దొంగ' ఓ అమ్మాయికి ఎలాంటి వాడు కావాలి అనే పాయింట్ కి దొంగ క్యారెక్టర్ తో రియలైజేషన్ తెప్పిస్తూ కామెడీగా తెరకెక్కించిన సినిమా.

My Dear Donga Review : ‘మై డియర్ దొంగ’ రివ్యూ.. అమ్మాయికి దొంగ నచ్చితే..

Abhinav Gomatam Aha OTT My Dear Donga Movie Review

My Dear Donga Review : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 19న ఆహాలో ‘మై డియర్ దొంగ’ అనే కొత్త సినిమా రిలీజయింది. అభినవ్ గోమఠం(Abhinav Gomatam), షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్, శశాంక్.. ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. షాలిని కొండేపూడి రచయితగా క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మాణంలో సర్వాంగ కుమార్ దర్శకత్వంలో ఈ మై డియర్ దొంగ తెరకెక్కింది. ప్రస్తుతం ఆహాలో మై డియర్ దొంగ దూసుకుపోతుంది.

కథ విషయానికొస్తే.. సుజాత(షాలిని), విశాల్(నిఖిల్) లవర్స్. కానీ విశాల్ సుజాతని ఎక్కువగా పట్టించుకోడు. ప్రాక్టికల్ గా అంటూ చిన్న చిన్న సరదాలు, సర్ ప్రైజ్ లు లాంటి వాటికి దూరంగా ఉంటాడు విశాల్. దీంతో సుజాత ఫీల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో సుజాత బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి(దివ్యశ్రీపాద) లవర్ వరుణ్(శశాంక) బుజ్జిని బాగా చూసుకుంటూ, సర్ ప్రైజ్ చేస్తూ ఉంటాడు. సురేష్(అభినవ్ గోమఠం) ఒక దొంగ. ఒక రోజు సుజాత ఫ్లాట్ లో ఎవరూ లేనప్పుడు దొంగతనానికి వస్తాడు. కానీ దొంగతనం చేసి బయటకి వెళ్దాం అనుకునేలోపు సుజాత తనని ఎవరూ పట్టించుకోవట్లేదు అనే బాధతో వస్తుంది. తన ఫ్లాట్ లో మొదట సుజాత – సురేష్ ని చూసి భయపడి అతనిపై దాడి చేస్తుంది. కానీ తర్వాత మాట్లాడటంతో అతను ఓ మంచి దొంగ అని తెలిసి ఫ్రెండ్ అవుతుంది.

కనీసం తన బాయ్ ఫ్రెండ్, అమ్మ తిన్నావా అని కూడా అడగరు అలాంటింది దొంగ అడగడంతో సురేష్ తో ఫ్రెండ్ గా క్లోజ్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ డే తన పుట్టిన రోజు అవ్వడంతో రాత్రి విశాల్, బుజ్జి, వరుణ్ అంతా వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చామనుకుంటారు సుజాతకు. వాళ్లకు సురేష్ ని తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ గా పరిచయం చేస్తుంది. మరి సురేష్ దొంగ అని వాళ్ళకి తెలుస్తుందా? సుజాత – సురేష్ మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుందా? సుజాత బర్త్ డే జరుగుతుందా? సుజాత లవ్ లైఫ్ ఏమైంది? వీళ్లందరి జీవితాల్లో సురేష్ ఎలాంటి మార్పు తెచ్చాడు? అసలు సురేష్ ఎందుకు దొంగగా మారాడు? సురేష్ దొంగ అని తెలిసినా సుజాత ఎందుకు కనెక్ట్ అయింది? అనేవి తెలియాలంటే ఆహా ఓటీటీలో చూడాల్సిందే.

Also Read : Sivaji : డబ్బుల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన మెగాస్టార్.. ఆ సమయంలో.. ఎంతంటే..?

సినిమా విశ్లేషణ.. ఒక అమ్మాయి తన లైఫ్ లో ఎలాంటి వాడు రావాలి అనుకుంటుంది అనే కథకు దొంగ పాయింట్ జత చేసి కామెడీగా చూపించడానికి ప్రయత్నించారు. సినిమా చూస్తున్నంతసేపు ఇది కచ్చితంగా అమ్మాయే రాసి ఉంటుంది అనిపిస్తుంది. ఈ సినిమాని రాసింది షాలినినే. ఆమె ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేయడం గమనార్హం. సినిమాలో దొంగ ఎంటర్ అయ్యేవరకు సినిమా బోరింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కథ అంతా సుజాత పాయింట్ అఫ్ వ్యూలోనే సాగుతుంది. సినిమా అంతా ఒక్క రాత్రిలో జరిగే కథ కావడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇప్పటికే కమెడియన్ గా దూసుకుపోతున్న అభినవ్ గోమఠం దొంగ పాత్రలో కామెడీతో నవ్విస్తాడు. షాలిని చూడటానికి బాగున్నా, నటన పరంగా మాత్రం ఇంకా బాగా చేయాల్సింది అనిపిస్తుంది. నిఖిల్, శశాంక్, దివ్య శ్రీపాద.. పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కథలో భాగంగా వచ్చే సాంగ్స్ బాగున్నాయి. తక్కువ లొకేషన్స్ లో సినిమాని పూర్తిచేశారు. సినిమా అంతా ఒక అమ్మాయి గురించి కాబట్టి డైలాగ్స్ అన్ని ఆ కోవలోనే ఉంటాయి. దర్శకుడిగా సర్వాంగ కుమార్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘మై డియర్ దొంగ’ ఓ అమ్మాయికి ఎలాంటి వాడు కావాలి అనే పాయింట్ కి దొంగ క్యారెక్టర్ తో రియలైజేషన్ తెప్పిస్తూ కామెడీగా తెరకెక్కించిన సినిమా.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.