గ్రామీణుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది : రేణూ దేశాయ్

మహానగరాల్లో ఉంటూ…నిత్యం బిజీ లైఫ్ తో కాలం గడుపుతూ ఉద్యోగమో, వ్యాపారమో చేసుకునే వారికి అప్పుడప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ వదిలేసి ఏ పల్లెటూరుకో వెళ్లి అక్కడ కొన్నిరోజులు సరదాగా గడిపి కాస్త సేద తీరాలనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో ఉండే ట్రాఫిక్ జాంలు, రణగొణ ధ్వనులు, వాయు కాలుష్యం కంటే పచ్చటి పల్లెల్లోని ఆహ్లదకర వాతావరణం లో తిరుగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది.
సినీనటి రేణూదేశాయ్ కి కూడా ఇలాంటి కోరిక ఎప్పటి నుంచో ఉందిట. ఆ కోరిక ఇటీవల అనుకోకుండా తీరిందిట . ఈవిషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పల్లెల్లో తిరగాలనే తన కోరిక తీరిందని చెపుతూ దానికి సంబంధించిన కొన్ని హార్ట్ టచింగ్ ఫోటోలను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు.
రేణుదేశాయ్ ఇటీవల తన సినిమా షూటింగ్ ముగించుకుని ప్రొడక్షన్ డిజైనర్ తో కలిసి కారులో ఓ మారుమూల గ్రామం మీదుగా హైదరాబాద్ వస్తున్నారు. ప్రయాణంలో ఉండగా తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లాలని లేదని ప్రోడక్షన్ డిజైనర్ తో చెప్పిందట రేణూ దేశాయ్. ఆమె అలా చెప్పిందో లేదో సరిగ్గా అదే సమయానికి కారు టైర్ పంక్చర్ అయ్యింది. వెంటనే కారు దిగేసి ఆమె ఆ గ్రామస్తులను కలిసింది. రేణూ రాగానే సంబరపడిన గ్రామస్తులు వాళ్లకు తినడానికి లేకపోయినా సరే ఆమెకు ఉప్మా, టీ ఇచ్చారు. చలిగా ఉండటంతో మంట కూడా వేశారు. ఆ రాత్రి ఆమె వారితోనే అలా నిద్రపోయింది. ఈ విషయాలను రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
వాస్తవంగా రేణు దేశాయ్ కి సినిమాల్లో ఎంత పాపులారిటీ వచ్చిందో లేదో తెలీయదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె తన బిజీలైఫ్ లో ఉంటూనే సోషల్ మీడియాలో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
“మన దగ్గర ఎంత డబ్బుండీ ఏం లాభం దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని” ఆ పేద కుటుంబాల గొప్పదనం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామాలు ఎప్పుడు మంచివే అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.