Allu Arjun : నాకు పార్టీలతో సంబంధం లేదు.. శిల్పా రవి కోసమే వచ్చాను.. ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్..
అల్లు అర్జున్ వైసీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి వెళ్లారు.

Allu Arjun Comments in Election Campaign for Supporting YCP MLA Candidate Shilpa Ravichandra Kishore
Allu Arjun : ఏపీలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేడే ఎన్నికల ప్రచారంకు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా అల్లు అర్జున్ వైసీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి వెళ్లారు. శిల్పా రవి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో శిల్పా రవి కోసం అల్లు అర్జున్, తన భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం చేయడానికి నేడు నంద్యాల వెళ్లారు.
అల్లు అర్జున్ నంద్యాలకు రావడంతో అభిమనులు భారీ ర్యాలీతో, గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్పా రవి ఇంటి వద్దకు వెళ్లి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
Also Read : Allu Arjun : నంద్యాలలో భారీ జనసందోహం.. వైసీపీ నేత కోసం అల్లు అర్జున్ ప్రచారం..
ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికొకసారి కలిసేవాళ్ళం. కానీ గత అయిదేళ్లుగా ఆరునెలలకొకసారే కలుస్తున్నాం. నాకు పార్టీలతో సంబంధం లేదు. కేవలం శిల్పా రవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నేను నంద్యాలకు రావడం జరిగింది. ఎమ్మెల్యే శిల్పా రవి వద్దన్నా కూడా నేనే తనను అభినందించడానికి, విషెస్ చెప్పడానికి నంద్యాల వచ్చాను. అతనితో నాకు, నా కుటుంబానికి ఉన్న అనుబంధమే నన్ను నంద్యాలకు వచ్చేలా చేసింది. ప్రజల కోసం కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి వచ్చాను. రవికి గతంలో మాట ఇచ్చాను. అతని మంచితనమే నన్ను ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేలా చేసింది. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఇక ఈ ప్రచారంలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చి నాకు బెస్ట్ విషెష్ చెప్పడం మరిచిపోలేనిది. సినిమాల్లో బిజీగా ఉన్నపటికీ ఒక మిత్రుడి కోసం ఇంత దూరం రావడం ఆనందంగా ఉంది. అల్లు అర్జున్ రాజకీయాలలో లేకపోయినప్పటికీ రాజకీయాలపై అవగాహన ఉంది. ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ లో రాలేడు అనుకున్నా కానీ గుర్తు పెట్టుకొని మిత్రుడి కోసం ఇంత దూరం రావడం సంతోషాన్నిచ్చింది. తన మిత్రులు అందరూ ఎవరెవరి రంగాలలో వారు ఉన్నతంగా ఎదగాలని కోరుకునే వ్యక్తి అల్లు అర్జున్. నాకు మద్దతు ఇస్తున్న అల్లు అర్జున్ కు ధన్యవాదాలు అని అన్నారు.