Uday Raj : ఒకప్పుడు ఆర్టిస్టులకు అసిస్టెంట్ గా పనిచేసి.. ఇప్పుడు హీరోగా సినిమా..
ఉదయ రాజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

An Artist Assistant Uday Raj Now Turned as Hero with Madhuram Movie
Uday Raj : ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మధురం. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యం.బంగార్రాజు నిర్మాణంలో రాజేష్ చికిలే దర్శకత్వంలో తెరకెక్కుతున్న మధురం సినిమా రేపు ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఉదయ రాజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఉదయ్ రాజ్ తన సినీ ప్రయాణం గురించి చెప్తూ.. నేను 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. మొదట ఆర్టిస్టులకు అసిస్టెంట్ గా పనిచేశా. తర్వాత కెమెరా, ఆర్ట్, లైట్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లలో పనిచేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు మధురం సినిమాతో హీరోగా మారా. నేను చిన్నప్పట్నుంచీ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. ఆచార్య షూటింగ్ టైమ్‌లో ఆయనతో మాట్లాడటం మర్చిపోలేను అని తెలిపాడు.
Also Read : Abhinaya Wedding Photos : ప్రియుడితో నటి అభినయ పెళ్లి.. ఫోటోలు వైరల్..
మధురం సినిమా గురించి చెప్తూ.. ఇది నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ. ఇందులో మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తాను. చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో చబ్బీగా కనిపిస్తా. మళ్లీ సన్నగా అవడం కోసం ఫుడ్ తినడం మానేసి కొన్ని రోజులు కేవలం నీళ్లు మాత్రమే తాగాను. నైంటీస్‌లో స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పటి పిల్లలు ఎలా బిహేవ్ చేశారనే వాటిపై కొన్ని రీసెర్చ్‌లు చేశాం. స్కూల్‌కి సైకిల్ వేసుకెళ్లి అమ్మాయి ముందు బ్రేక్ కొట్టడం, చేతులు వదిలేసి తొక్కడం లాంటి సీన్లతో పాటు విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా సమయంలో కష్టాల గురించి చెప్తూ.. కరోనా ముందే అనుకున్నా అనేక సమస్యలు వస్తూ షూట్ లేట్ అయింది. ఈ సినిమా విషయంలో కొన్ని సమస్యలు ఫేస్ చేశాను కానీ నిర్మాత బంగార్రాజు గారు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సినిమాకు అందరూ కొత్త వాళ్ళు పనిచేసినా అందర్నీ ఎంకరేజ్ చేసారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత బంగార్రాజు గారే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు అని తెలిపాడు ఉదయ్ రాజ్.