బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసిన అవెంజర్స్!

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న అవెంజర్స్-ఎండ్‌గేమ్ మూవీ బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 8 వేల కోట్లకిపైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 46 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. సూపర్ హీరోలంతా కట్టకట్టుకుని దండయాత్ర చేయడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఎండ్ గేమ్ వసూళ్లు ఎలా రికార్డు స్థాయిలో ఉన్నాయో అందులో నటించిన సూపర్ హీరోల రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. ఇండియాలో కూడా ఎండ్ గేమ్ 200 కోట్లకిపైగా వసూళ్లు సాధించింది.
అవెంజర్స్ ఎండ్ గేమ్ వసూళ్లలాగే సినిమాలో నటించిన సూపర్ హీరోల రెమ్యూనరేషన్ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండ్ గేమ్ మూవీలో చివరికి ఆడియన్స్ తో కంటతడి పెట్టించిన ఐరన్ మ్యాన్ రాబర్డ్ డౌనీ ఐదు వందల కోట్లకిపైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. గతేడాది వచ్చిన అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్ కోసం రాబర్ట్ డౌనీకి దాదాపు 75 మిలియన్ల డాలర్లను చెల్లించారు. అంటే అక్షరాల 524 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. గతంలో స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమాకి పనిచేసిన టైంలో ఐరన్ మ్యాన్ రోజుకి 34 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
ఇక కెప్టెన్ మార్వెల్ పాత్రలో అలరించిన స్కార్లెట్ జాన్సన్ ఎండ్ గేమ్ లో నటించినందుకు 139 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. థోర్ క్యారెక్టర్ చేసిన హేమ్స్ వర్త్, కెప్టెన్ అమెరికా పాత్ర పోషించిన క్రిస్ ఇవాన్స్ కూడా దాదాపు వంద కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారు. వీరితో పాటుగా నటించిన మిగతా సూపర్ హీరోలు కూడా మినిమం 50 కోట్లకి పైగానే పారితోషికం అందుకున్నారు.