Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9 విన్నర్ కల్యాణ్ పడాల.. చరిత్ర సృష్టించిన కామనర్..
టైటిల్ కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీనే నడిచింది. నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ జరిగింది.
Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ పడాల చర్రిత సృష్టించాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అత్యధిక ఓట్లు రావడంతో హోస్ట్ నాగార్జున కల్యాణ్ ని విజేతగా ప్రకటించారు. ఇక, చివరి వరకు కల్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చిన నటి తనూజ.. రన్నరప్ తో సరిపెట్టుకుంది.
కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలవడంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్మీ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో కల్యాణ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
టైటిల్ కోసం గత రెండు వారాల నుంచి కల్యాణ్ పడాల, తనూజ మధ్య గట్టి పోటీనే నడిచింది. నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ జరిగింది. కొన్ని సిచువేషన్స్ లో తనూజ కూడా టాప్ లో నిలిచింది. కానీ, ఫైనల్ గా ఆడియన్స్ మాత్రం కల్యాణ్ పడాల వైపే మొగ్గు చూపారు. దీంతో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ విన్నర్ గా ఒక కామనర్ నిలిచాడు. మొత్తం 105 రోజుల పాటు ఈ రియాలిటీ షో జరిగింది.
బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే చాలు అనుకున్న స్టేజ్ నుంచి టైటిల్ విన్నర్ స్టేజ్ కి ఎదిగాడని కితాబిస్తున్నారు. సామాన్యుడు తలుచుకుంటే జరగనిది ఏమీ ఉండదని కల్యాణ్ నిరూపించాడని పొగుడుతున్నారు. సెలబ్రిటీని ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు కల్యాణ్ పడాల. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా కల్యాణ్ పడాల హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక, ఈ సీజన్ లో మరో కామన్ మ్యాన్ డెమాన్ పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. సంజన ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ను గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందని కళ్యాణ్ పడాల అన్నాడు. వస్తున్నాను, కొడుతున్నాను అని సెలెక్షన్స్ రోజే తాను చెప్పానని, ఇప్పుడు కొట్టి చూపించానని అన్నాడు. తనను ప్రేమించిన వాళ్లకు, తనను నమ్మి ఓటు వేసిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పాడు. తన కొడుక్కి సపోర్ట్ చేసిన వారందరికీ కల్యాణ్ పడాల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
