Viswa Karthikeya : ఛైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా.. విశ్వ కార్తికేయ..

చిన్న వయసులోనే భిన్నమైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కుమన్నాడు విశ్వ కార్తికేయ..

Viswa Karthikeya : ఛైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా.. విశ్వ కార్తికేయ..

Birthday Wishes To Actor Viswa Karthikeya

Updated On : July 2, 2021 / 4:31 PM IST

Viswa Karthikeya: చిన్న వయసులోనే భిన్నమైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కుమన్నాడు విశ్వ కార్తికేయ.. ఆరేళ్ల వయసులో తెరంగేట్రం చేసిన విశ్వ ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ సినిమాతో పరిణితి చెందిన నటుడిగా ప్రసంశలు అందుకున్నాడు. ‘ఆ నలుగురు’ తో శభాష్ అనిపించుకొని నటకిరీటికి అప్పడాలు ఎలా అమ్మాలో నేర్పి సక్సెస్ అయ్యాడు.

మంచు విష్ణు మొదటి సినిమా ‘విష్ణు’ లోనూ మెరిశాడు. ‘గోరింటాకు’ లో రాజశేఖర్ చిన్నపటి పాత్రను అద్భుతంగా పండించి, ‘లేత మనసులు’లో కళ్యాణి కొడుకుగా పెద్ద మనసుతో మెప్పించాడు. ‘శివ శంకర్’ లో మోహన్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్, ‘అధినాయకుడు’ లో చిన్నప్పటి బాలయ్య బాబుగా వెండి తెరపై నటించి బాలయ్య బాబుతో ప్రశంసలు అందుకున్నాడు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఈ నిజం అబద్ధం ఐతే’ అనే టెలి ఫిల్మ్‌లో ప్రేక్షకులనే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మెప్పించి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు, అలాగే అవార్డు ఫర్ మెరిటోరియస్ అచీవ్‌మెంట్ అవార్డు పొందాడు.

Viswa Karthikeya

ఇటు చదువులోనూ, అటు సినిమాల్లోనూ రాణిస్తూ 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా తన మార్క్ చూపించాడు విశ్వ కార్తికేయ. ఎనర్జిటిక్ హీరోగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఎం సుధాకర్ రెడ్డి నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వంలో ‘కళాపోషకులు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు.. హీరోగా తన నటనకుగాను విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు విశ్వ..

దర్శకులు వి. సముద్ర ‘జైసేన’ చిత్రంలోనూ మెయిన్ లీడ్‌గా నటించి తెలుగు, కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ‘జైసేన’, ‘కళాపోషకులు’ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సినీ పెద్దల ప్రశంసలను సైతం అందుకుని ప్రేక్షకులను మెప్పించాడు.

Viswa Karthikeya

ప్రస్తుతం సరికొత్త ప్రేమ కథాంశంతో RR క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై ఎన్. చంద్రమోహన్ రెడ్డి నిర్మాతగా, చలపతి పువ్వల దర్శకత్వంలో, రథన్ మ్యూజిక్ సంగీత దర్శకుడిగా తెలుగు, తమిళ్ భాషల్లో సీనియర్ తారాగణంతో భారీ బడ్జెట్ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో కథానాయకుడుగా నటించిన విశ్వ కార్తికేయ ఈ చిత్రం విడుదల తర్వాత పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.