Salman Khan: ట్రైజెమినల్ న్యూరాల్జియా, బ్రెయిన్ అన్యూరిజం, AVM.. సల్మాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధులు.. ఏంటివి..?.. ప్రతిరోజూ నరకమే..
బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్ బ్రెయిన్‌కు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.

Bollywood hero Salman Khan
Salman Khan: బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్ బ్రెయిన్ కు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ’ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పెళ్లి గురించి మాట్లాడుతూ తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చారు.
సల్మాన్ ఖాన్‌కు 59ఏళ్లు. ఇప్పటికీ పెండ్లి చేసుకోలేదు. ఇదే విషయంపై కపిల్ శర్మ ఆయన్ను ప్రశ్నించాడు. వివాహం, విడాకులు భావోద్వేగపరంగా, ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలన్న సల్మాన్.. వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు. అయినా, తాను అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని.. ట్రైజెమినల్ న్యూరల్జియా, ఏవీ మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజమ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు.. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు.
సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు చాలా ప్రమాదకరమైనవి. ట్రైజెమినల్ న్యూరాల్జియా అనేది ట్రైజెమినల్ నరాల సమస్య వల్ల వచ్చే ఒక దీర్ఘకాలిక నొప్పితో కూడుకున్న వ్యాధి. ట్రైజెమినల్ నరం ముఖం నుండి మెదడుకు సంకేతాలను పంపే ఒక నరం. ఈ నరం దెబ్బతిన్నప్పుడు లేదా చికాకుకు గురైనప్పుడు నొప్పి వస్తుంది. ఇది ముఖంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే.. విద్యుత్ షాక్ లేదా కత్తిపోటులా అనిపిస్తుంది. ఆ నొప్పి ముఖానికి ఒకవైపు మాత్రమే ఉంటుంది. ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిని “ఆత్మహత్య వ్యాధి” అని కూడా పిలుస్తారు.
బ్రెయిన్ అన్యూరిజం అంటే మెదడు సంబంధిత సమస్య. మెదడులోని రక్తనాళాలు ఉబ్బిపోయే పరిస్థితి. ఇలాంటి స్థితిలో అవి చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి స్ట్రోక్ లేదా మరణానికి దారితీయవచ్చు. బ్రెయిన్ అన్యూరిజం సమస్యతో బాధపడేవారికి అకస్మాత్తుగా విపరీతమైన తలనొప్పి వస్తుంది. మెడ నొప్పితోపాటు బిగుతుగా ఉండటం, కంటి చూపు కోల్పోవటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇది మెదడులో రక్తస్రావం (హెమరేజ్), మూర్ఛలు, ఇతర నాడీ సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది.
‘‘AVM (ఆర్టెరియోవీనస్ వైకల్యం) అనేది రక్త నాళాల్లో నెలకొన్న అసాధారణ సమస్య. ఇది ధమనులు, సిరల మధ్యలో సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా, ధమనులు రక్త ప్రవాహాన్ని కేశనాళికల ద్వారా సిరలకు తీసుకెళ్తాయి. కానీ, ఏవీఎంలలో, కేశనాలికల ద్వారా కాకుండా ధమనులు, సిరల మధ్య అసాధారణమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది రక్త ప్రవాహంలో సమస్యలను కలిగిస్తుంది. కొన్నిసార్లు రక్తస్రావం, కణజాలం నష్టానికి దారితీస్తుంది. ఈ సమస్య కారణంగా వెన్నునొప్పి లేదా మూర్ఛలు వంటి లక్షణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఏవీఎంలు రక్తస్రావం అయ్యే వరకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.’’