మనిషి రూపంలో దేవుడు: సహాయం అడిగిన వ్యక్తినే సహాయం చేయడం కోసం పెట్టేశాడు

  • Published By: vamsi ,Published On : December 27, 2019 / 05:06 AM IST
మనిషి రూపంలో దేవుడు: సహాయం అడిగిన వ్యక్తినే సహాయం చేయడం కోసం పెట్టేశాడు

Updated On : December 27, 2019 / 5:06 AM IST

డ్యాన్స‌ర్‌గా, న‌టుడిగా, హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాఘ‌వ లారెన్స్. వివాదాల‌కు దూరంగా అనాథ‌లను చేర‌దీస్తూ వారికి అండ‌గా నిలిచే రాఘవ లారెన్స్ తమిళనాడులో చెన్నై వేదికగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇందుకోసం చెన్నైలో ఓ ఆశ్ర‌మాన్ని కూడా న‌డుపుతున్నాడు లారెన్స్.

అయితే కొంతకాలంగా తన సేవా కార్యక్రమాలను హైదరాబాద్‌‌లో కూడా ప్రారంభించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అందుకు త‌గ్గ స‌మ‌యం వ‌చ్చేసింద‌ని ప్రకటించాడు లారెన్స్. దానిని బాధ్య‌త‌గా నిర్వ‌హించే వ్య‌క్తిని కూడా పట్టుకున్నాడు. రాఘ‌వ లారెన్స్ ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. హైద‌రాబాద్‌కు చెందిన శివ‌కుమార్ అనే వ్యక్తి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుని త‌న చ‌దువుకు త‌గ్గ ప‌ని కోసం గ‌త కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే అత‌నికి రెండు చేతులు లేక‌పోవ‌డంతో ఎవ‌రూ ప‌ని ఇవ్వట్లేదు. 

దీంతో విసిగిపోయిన శివ కుమార్.. సోష‌ల్ మీడియా ద్వారా రాఘ‌వ లారెన్స్‌ని ప‌ని ఇప్పించ‌మ‌ని ప్రాధేయ‌ప‌డ్డాడు. దీంతో మ‌న‌సు చలించిన లారెన్స్ హైద‌రాబాద్ రావ‌డ‌మే కాకుండా శివ‌కుమార్ వివ‌రాలు తెలుసుకుని అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లాడు. అత‌నికి హైద‌రాబాద్‌లో ప్రారంభించ‌బోయే ఆశ్ర‌మం బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. దీంతో రాఘ‌వ లారెన్స్‌పై  ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. సోష‌ల్ మీడియాలో  `దైవం మ‌నుష్య రూపేనా`… నువ్వ‌న్నా నిజ‌మైన దేవుడివి. మనిషి రూపంలో దేవుడు.. సాయం చేయ‌డంలో నువ్వు భగవంతుడివి అంటూ నెటిజ‌న్స్ లారెన్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

అంతేకాదు మరో వ్యక్తి కూడా ఇటువంటి అభ్యర్ధనే చెయ్యగా అతనికి సాయం చేస్తానని మాట ఇచ్చాడు లారెన్స్. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చాడు.