బిల్లు లొల్లి-సెలబ్రిటీలకూ కరెంట్ కష్టాలు

గత మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైపోంది. ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల పరిస్థితి చాలా నయం అనుకుంటుంటే.. మూలిగే నక్కమీద తాటికాయ పడిందన్న చందాన వారికీ కరోనా కష్టాలు తప్పడంలేదు. ఎలా అంటారా.. కరెంట్ బిల్ రూపంలో..
పలువురు హీరోలు, హీరోయిన్లు కరెంట్ బిల్ ఇంతేంటి బాబోయ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అలనాటి కథానాయిక రాధ పెద్ద కుమార్తె, హీరోయిన్ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు రాగా, తాజాగా మరో హీరోయిన్ తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. ట్వీట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్ బిల్లు రావడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేసింది.
‘ఇది మా అపార్ట్‌మెంట్ కరెంట్ బిల్..శుభ్రం చేయడానికి వారానికి ఒకసారి వెళ్లడం తప్ప ఈ అపార్ట్‌మెంట్‌లో మేమెవరం ఉండటం లేదు. మార్చిలో రూ. 570, ఏప్రిల్‌లో రూ. 730 రాగా.. మే నెలకి గాను రూ. 8,640 బిల్ వచ్చింది. ఇప్పుడు 36 వేలు వచ్చింది.ఈ బిల్ చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వాడుకుంటున్నారనే భయం కలుగుతోంది.అదానీ ఎలక్ట్రిసిటీ ఏ అధికారంతో ఇంత వసూలు చేస్తుంది?’ అంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్ చేసింది.
ఇక శ్రద్ధాదాస్ తనకు కూడా 34 వేల రూపాయల కరెంట్ బిల్ వచ్చిందని వాపోయింది. ఇక బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తనకు ఏకంగా 30 వేల రూపాయల బిల్ వచ్చిందని లబోదిబోమన్నాడు. డినో మోరియా, అలీ ఫాజల్ వంటి నటులు తాప్సీకి తమ ట్వీట్లతో మద్దతు తెలిపారు. సామాన్యులకే అంతేసి బిల్ వస్తున్నప్పుడు సెలబ్రిటీలకి వస్తే తప్పేంటి, ఉన్నోళ్లు కట్టుకుంటారు..మరిలేని వాళ్ల పరిస్థితి ఏంటి?అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read:ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న శృతి హాసన్