Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
Hyderabad : హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. అంబర్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Hyderabad
- హైదరాబాద్‌లో విషాద ఘటన
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
- సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ముగ్గురు
Hyderabad : హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. అంబర్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామ్ రాజ్ (55), మాధవి (50), శశాంక్ (24)లుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్రాజ్ కుటుంబం గత కొన్నేళ్లుగా అంబర్‌పేట బాపూనగర్‌లో నివాసం ఉంటుంది. ఆయన అంబర్‌పేట్‌లో ల్యాండ్‌మార్క్ హోటల్‌ను నడుపుతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటలకు స్నేహితుడు రవికి రామ్రాజ్ వాట్సాప్ మెసేజ్ చేశాడని.. అతను ఇంటికి వచ్చి చేసేసరికి ఉరివేసుకుని దంపతులు కనిపించారని పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రామ్రాజ్, మాధవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. శశాంక్ మణికట్టు వద్ద కత్తితో కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలిలో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే, వారి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలా.. ఆరోగ్య సమస్యలా.. కుటుంబ సమస్యలు కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై అడిషనల్ డీసీపీ నరసయ్య మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ముందు మాధవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఆ తరువాత రామ్రాజ్ చనిపోయినట్లు చెప్పారు. వారిద్దరి తరువాత కుమారుడు శశాంక్ చేతి మణికట్టు కట్ చేసుకొని ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తుందని చెప్పారు.
ఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించిందని, అందులో తమ అప్పుల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. ఆ తరువాత రవి అనే వ్యక్తికి రాత్రి 3గంటల సమయంలో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెస్సేజ్ పెట్టినట్లు తెలిపారు. రవి మెసేజ్ చూసుకొని ఉదయం 8గంటలకు వచ్చే సరికి ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నట్లు వెల్లడించారు. అప్పుల బాధ, హోటల్ లాస్ తదితర కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని.. అన్ని కోణాల్లో తాము దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
