Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్..
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఒకరి మీద ఒకరికి ఉండే అంచనాలు.. ఇలా రియల్ లైఫ్ పాయింట్స్ ని తీసుకొని హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ని తెరకెక్కించారు.

Chaitanya Rao Hebah Patel Honeymoon Express Movie Review & Rating
Honeymoon Express Movie Review : చైతన్యరావు(Chaitanya Rao), హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. సోనాలి(హెబ్బా పటేల్) సైక్లింగ్ చేస్తూ చిన్న యాక్సిడెంట్ అయి కిందపడటంతో ఈషాన్(చైతన్య రావు) చేయి అందిస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. కానీ సోనాలి చాలా ఫాస్ట్, ఈషాన్ నిదానం. వీళ్ళ ఇద్దరి టేస్టులు కూడా కలవవు. దీంతో వీరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీరి శృంగార జీవితం కూడా బాగోదు. దీంతో థెరపిస్ట్ లని కలుస్తుంటారు.
ఒక రోజు రోడ్ మీద వెళ్తుంటే ఒక సీనియర్ కపుల్(తనికెళ్ళ భరణి, సుహాసిని) వీళ్ళని కలిసి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అని ఒక గేమ్ చెప్పి ఒక రిసార్ట్ కి పంపిస్తారు. అసలు ఆ ఓల్డ్ కపుల్ ఎవరు? హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ ఏంటి? భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం అయ్యాయా? వీరిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? వీరి శృంగార జీవితం బాగుపడిందా? ఆ రిసార్ట్ లో ఏం జరిగింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Nindha : వరుణ్ సందేశ్ ‘నింద’ మూవీ రివ్యూ.. ఒక నిర్దోషిని ఎలా కాపాడారు?
సినిమా విశ్లేషణ.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఒకరి మీద ఒకరికి ఉండే అంచనాలు, అవి అందుకోలేకపోవడంతో వచ్చే కష్టాలు.. ఇలా రియల్ లైఫ్ పాయింట్స్ ని తీసుకొని ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ని తెరకెక్కించారు. అయితే రిసార్ట్ లోకి వెళ్లేంతవరకు బాగానే సాగినా ఆ తర్వాత జరిగేది ఊహ లేక నిజమా అనే భ్రాంతిలో ప్రేక్షకులని పడేస్తారు.
స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. రొమాంటిక్ సీన్స్ మాత్రం హీరో -హీరోయిన్స్ మధ్య బాగానే పెట్టారు. ఇక ఇలాంటి కథాంశంతో వచ్చే సినిమాల్లో క్లైమాక్స్ ముందే తెలిసిపోతుంది కాబట్టి అన్ని సినిమాల్లో లాగే ఇక్కడ కూడా అదే భార్యాభర్తల క్లైమాక్స్ ఉంటుంది. తనికెళ్ళ భరణి, సుహాసిని జంటతో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కథ అంతా రెండు క్యారెక్టర్స్ మధ్యే సాగడంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. చైతన్య రావు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలోని రెండు వేరియేషన్స్ తో మరోసారి మెప్పించాడు. ఇక హెబ్బా పటేల్ అయితే తన అందాలతో అలరిస్తుంది. నటన, అందం రెండింటితో ప్రేక్షకులని మెప్పిస్తుంది. తనికెళ్ళ భరణి, సుహాసిని జంట కాసేపు నవ్విస్తుంది. ఈ సినిమా కథ మొత్తం ఈ నలుగురి మధ్యే సాగుతుంది.
సాంకేతిక అంశాలు.. తక్కువ లొకేషన్స్ లో షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. పాటలు మాత్రం వినడానికి, చూడటానికి కూడా బాగుంటాయి. మాములు కథకి కొత్త కథనం రాసుకున్నారు. దర్శకుడిగా బాల రాజశేఖరుని పర్వాలేదనిపించారు. నిర్మాణ పరంగా కూడా ఓకే అనిపిస్తుంది.
మొత్తంగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంటే వాళ్ళు ఎలా కలిశారు అనే కథాంశాన్ని రొమాంటిక్ గా చెప్పారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.