Nindha : వరుణ్ సందేశ్ ‘నింద’ మూవీ రివ్యూ.. ఒక నిర్దోషిని ఎలా కాపాడారు?

ఎప్పుడూ లవర్ బాయ్ లా కనిపించే వరుణ్ సందేశ్ ఈసారి చాలా సీరియస్ రోల్ లో కనిపించి..

Nindha : వరుణ్ సందేశ్ ‘నింద’ మూవీ రివ్యూ.. ఒక నిర్దోషిని ఎలా కాపాడారు?

Varun Sandesh Nindha Movie Review and Rating

Nindha Movie Review : ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత హీరోగా ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించిన నింద సినిమా నేడు జూన్ 21న విడుదల అయింది. శ్రేయ రాణి, క్యూ మధు, తనికెళ్ళ భరణి, ఛత్రపతి శేఖర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. వివేక్(వరుణ్ సందేశ్) నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ఉన్నత స్థానంలో పనిచేస్తూ ఉంటాడు. తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళు నిర్దోషిగా బయటకు రావడానికి పనిచేస్తాడు. ఓ రోజు జడ్జి అయిన తన తండ్రి(తనికెళ్ళ భరణి) ఓ కేసు విషయంలో బాధపడుతున్నాడని, తను ఇచ్చిన తీర్పు తప్పు అని భావిస్తున్నాడని తెలుస్తుంది వివేక్ కు. ఆ బాధతో తండ్రి చనిపోవడంతో వివేక్ ఆ కేసు టేకప్ చేస్తాడు.

కాండ్రకోట అనే గ్రామంలో మంజు(క్యూ మధు) అనే యువతిని బాలరాజు(ఛత్రపతి శేఖర్) అనే వ్యక్తి రేప్ చేసి చంపాడని అతన్ని అరెస్ట్ చేస్తే ఉరిశిక్ష వేస్తారు. బాలరాజు ఎలాంటి తప్పు చేయలేదని తన తండ్రి నమ్మడంతో వివేక్ దాన్ని ప్రూవ్ చేయాలని ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి, ఆ కేసుకి లింక్ ఉన్న కొంతమందిని కిడ్నాప్ చేయిస్తాడు. అసలు మంజుని చంపింది ఎవరు? మంజు కథేంటి? వివేక్ ఎవెరెవర్ని కిడ్నాప్ చేయించాడు? వాళ్ళని కిడ్నాప్ చేసి వివేక్ ఏం చేసాడు? బాలరాజు నిర్దోషిలా బయటకు వచ్చాడా? మంజుని చంపిన వాళ్ళకి శిక్ష పడిందా? ఈ క్రమంలో వివేక్ ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనేవి తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

Also Read : Kalki 2898 AD : క‌ల్కిలో మ‌ల‌యాళం స్టార్ హీరోయిన్ అన్నా బెన్..

సినిమా విశ్లేషణ.. ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా ఎవరో అతన్ని ఇరికించి శిక్ష పడేలా చేస్తే అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా కూడా అలాంటి కథాంశమే అయినా కథ, కథనంలో ఓ కొత్తదనం చూపించి ఓ ట్విస్ట్ తో ఆసక్తి కలిగించారు. ఫస్ట్ హాఫ్ అంతా వివేక్ కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో మాట్లాడటమే సాగుతుంది. దీంతో ఫస్ట్ హాఫ్ కొంత బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ కూడా బాలరాజుని బయటకు తీసుకొస్తాను అని వివేక్ చెప్పడంతో సింపుల్ గానే ఉంటుంది.

కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు బాలరాజు, మంజులు ఎవరు? వాళ్ళ కథలేంటి? వివేక్ కిడ్నాప్ చేసిన వాళ్ళ కథలేంటి? వాళ్లకి ఈ కేసుకి సంబంధం ఏంటి.. అంటూ ఒక్కోటి రివీల్ చేసుకుంటూ వెళ్తుండటంతో ఆసక్తిగా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మధ్యలోనే సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకు మాత్రం ట్విస్ట్ అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్ లో మరో ఊహించని ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే కథాంశాన్ని దర్శకుడు బాగానే రాసుకున్నాడు. సీరియస్ సినిమా అయినా భద్రం అక్కడక్కడా నవ్వించాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎప్పుడూ లవర్ బాయ్ లా కనిపించే వరుణ్ సందేశ్ ఈసారి చాలా సీరియస్ రోల్ లో కనిపించి మెప్పించాడు. హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. క్యూ మధు పాత్ర కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది. చేయని నేరానికి శిక్ష పడిన పాత్రలో ఛత్రపతి శేఖర్ బాగా నటించాడు. తనికెళ్ళ భరణి కాసేపే కనిపించినా ఓ ఎమోషన్ ని పండిస్తారు. శ్రేయ రాణి, యాని, భద్రమ్, సూర్య కుమార్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై.. పలువురు నటీనటులు కూడా వారి పాత్రల్లో చక్కగా నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. తక్కువ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ గా షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కొన్నిచోట్ల మాత్రం డైలాగ్స్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం చిన్న సినిమా, కొత్త నిర్మాత అయినా కథకు తగ్గట్టు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఖర్చుపెట్టారు. దర్శకుడిగా రాజేష్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

మొత్తంగా ‘నింద’ మూవీ.. చేయని తప్పుకి ఓ వ్యక్తిపై నింద మోపి శిక్షిస్తే హీరో అతన్ని ఎలా బయటకు తీసుకొచ్చాడు అని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.