Premalo Review : ‘ప్రేమలో’ మూవీ రివ్యూ.. ప్రేమికులకు అనుకోని కష్టం వస్తే..
తమిళ్ లో రా అండ్ రస్టిక్ గా ఉండే ప్రేమ సినిమాలు ప్రేమిస్తే, పరుత్తివీరన్, సుబ్రమణ్యపురం, నాచ్చియార్.. లాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు తెలుగులో వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఈ ప్రేమలో సినిమా అలాంటి కోవకి చెందినదే.

Chandu Koduri Charishma Shreekhar Premalo Movie Review and Rating
Premalo Review : చందు కోడూరి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘ప్రేమలో’. చరిష్మా శ్రీఖర్ హీరోయిన్ గా నటించగా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ లో రాజేష్ కోడూరి నిర్మించారు. శివాజీరాజా, మధుసూధనరావు, శ్రీనివాస్.. ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ ప్రేమలో సినిమా జనవరి 26న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. రవి(చందు) రాజమండ్రిలో ఓ మెడికల్ షాప్ లో, RMP డాక్టర్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రశాంతి(చరిష్మా)తో ప్రేమలో పడతాడు. తన సైడ్ ఇన్‌కమ్ కోసం యూట్యూబ్ లో ఓ ఛానల్ పెట్టి రాజమండ్రిలోనే ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు రవి. ప్రశాంతికి తన ప్రేమ గురించి చెప్దామనుకున్న సమయంలో ఆమె మూగమ్మాయి అని తెలుస్తుంది. అయినా ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ప్రశాంతి గతంలో ఓ గోదావరి ప్రమాదంలో తనని కాపాడింది రవి అనే గుర్తుచేసి తన ప్రేమని అంగీకరిస్తుంది.
అలా వీరి ప్రేమ సాగిపోతున్న సమయంలో ప్రశాంతి తండ్రికి వీరి ప్రేమ గురించి తెలిసి ప్రశాంతిని కట్టడి చేసి, వేరే పెళ్లి చేద్దామని ఫిక్స్ అయి, రవిని కొట్టిస్తాడు. రవి, ప్రశాంతి తమ బాధ మాట్లాడుకోవడానికి రాత్రి పూట కలవగా కొంతమంది దుండగులు రవిని కొట్టి ప్రశాంతిని రేప్ చేస్తారు. ప్రశాంతి తండ్రి వాళ్ళ ప్రేమని ఎలా అడ్డుకున్నాడు ? ప్రశాంతిని రేప్ చేసింది ఎవరు? రవి దానికి పగ తీర్చుకున్నాడా? ఆ సంఘటన తర్వాత ప్రశాంతికి ఏమైంది? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. తమిళ్ లో రా అండ్ రస్టిక్ గా ఉండే ప్రేమ సినిమాలు ప్రేమిస్తే, పరుత్తివీరన్, సుబ్రమణ్యపురం, నాచ్చియార్.. లాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు తెలుగులో వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఈ ప్రేమలో సినిమా అలాంటి కోవకి చెందినదే. సినిమా అంతా రియల్ లొకేషన్స్, ఎలాంటి లైటింగ్, సెటాప్స్ వాడకుండా చాలా రియలిస్టిక్ గా తీసారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో గురించి, హీరో యూట్యూబర్ అవ్వడం, హీరో-హీరోయిన్స్ మధ్య ప్రేమ సన్నివేశాలతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి వీరి ప్రేమ గురించి హీరోయిన్ తండ్రికి తెలిసి ఏం జరుగుతుంది అనే ఆసక్తితో సెకండ్ హాఫె మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో హీరోని కొట్టి హీరోయిన్ మీద రేప్ జరగడం, దాన్ని వాళ్లిద్దరూ ఎలా తీసుకున్నారు, హీరో పగ అంటూ క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో నడిపించారు. రెగ్యులర్ తెలుగు సినిమాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఈ సినిమా క్లైమాక్స్ ఊహించరు. ఆ క్లైమాక్స్ తర్వాత ఇలాంటివి తమిళ్ లో ఎక్కువ సినిమాలు వస్తాయి, తెలుగులో ఇలా తీసి ధైర్యం చేశారనే అనుకుంటాం. ఆ క్లైమాక్స్ మీరు తెరపై చూడాల్సిందే.
Also Read : HanuMan : వసూళ్లలో దూసుకుపోతున్న ‘హనుమాన్’.. 250 కోట్ల కలెక్షన్స్
నటీనటులు.. చందు ఓ పక్క హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు. మూగ అమ్మాయిగా మొదటి హాఫ్ లో క్యూట్ గా కనిపించిన హీరోయిన్ ఛరిష్మా సెకండ్ హాఫ్ లో అత్యాచార బాధితురాలిగా ఎమోషన్ తో మెప్పిస్తుంది. హీరోయిన్ తండ్రిగా శ్రీనివాస్, హీరో తండ్రిగా శివాజీ కొన్ని ఎమోషనల్ సీన్స్ తో అలరిస్తారు. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.
సాంకేతిక విషయాలు.. సినిమా మొత్తం రాజమండ్రి రియల్ లొకేషన్స్ లోనే తీశారు. అయితే బయట జరిగే సీన్స్ కి ఎక్కడా కూడా లైట్స్ వాడకుండా రియల్ గా తీయడంతో కొన్ని సన్నివేశాల్లో కెమెరా క్వాలిటీ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ BGM బాగా వర్కౌట్ అయింది. యూట్యూబర్స్ మీద రాసిన పాట వినడానికి బాగుంటుంది. మరో ప్రేమ సాంగ్ పర్వాలేదనిపిస్తుంది. కథనం గతానికి, ప్రస్తుతానికి మధ్య నడిపిస్తుండటంతో ప్రేక్షకులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడిగా చందు మొదటి సినిమా అయినా బాగానే తీసాడని చెప్పొచ్చు.
మొత్తంగా ఇద్దరి ప్రేమికులకు అనుకోని కష్టం వచ్చి పడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘ప్రేమలో’. తమిళ్, మలయాళం రా అండ్ రస్టిక్ ప్రేమ సినిమాలు నచ్చేవాళ్ళు ఈ ప్రేమలో సినిమాని థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.