తెలంగాణలో ఆసక్తికరంగా రాజ్యసభ ఎన్నికల రాజకీయం.. జంపింగ్ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్
రాజ్యసభ రేసులో నిలిచే విషయంలో బీఆర్ఎస్ లెక్కలు మరోలా ఉన్నాయట. రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ బలం 37గా ఉంది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు.
- రెండు రాజ్యసభ సీట్లపై ధీమాగా ఉన్న అధికార కాంగ్రెస్
- రాజ్యసభ బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా?
- మైనార్టీ క్యాండిడేట్‌ను పోటీలో పెట్టే ఆలోచన చేస్తుందా?
- బీఆర్ఎస్ మైనార్టీ అభ్యర్థిని పెడితే ఎంఐఎం మద్దతు ఇస్తుందా?
Telangana: తెలంగాణలో రాజ్యసభ సీట్ల రేసు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు..ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం తామే దక్కించుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు రాజ్యసభ సీటుకు కావాల్సిన బలం లేకున్నా..సరికొత్త వ్యూహానికి తెరలేపుతుందన్న టాక్ ఆసక్తికరంగా మారింది. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయ కలిసివచ్చే అంశాలపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టి పెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే..ఒక్కో రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు 40 ఓట్లు అవసరం పడుతుంది. ఈ లెక్కన రెండు రాజ్యసభ స్థానాలకు 82 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.
అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే 38 ఓట్లు అవసరం కానున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు 76 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా..ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. కోటా సరిపోకపోతే రెండో ప్రాధాన్యత ప్రాధాన్యత ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు కీలకం అవుతాయి.
Also Read: విశాఖలో వైసీపీని నడిపించేదెవరు? ఎందుకీ పరిస్థితి?
మరోవిధంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిపితే 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎంఐఎం మద్దతు లేకపోయినా జంపింగ్ ఎమ్మెల్యేలను కలిపితే అప్పుడు హస్తం పార్టీ బలం 76కు చేరుతుంది. అప్పుడు ఈజీగా రెండు రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసినా..అనర్హత వేటు వేసే అవకాశం లేదు కాబట్టి పెద్దగా ఇబ్బందేం ఉండదని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారట.
అయితే రాజ్యసభ రేసులో నిలిచే విషయంలో బీఆర్ఎస్ లెక్కలు మరోలా ఉన్నాయట. రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ బలం 37గా ఉంది. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మహిపాల్ రెడ్డిని మినహాయిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీతోనే కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్కు గూడెం మహిపాల్‌రెడ్డితో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించే యోచన
అయితే 28 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పార్టీ.. మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచన చేస్తుందట. మైనార్టీ క్యాండిడేట్‌ను పెట్టి ఎంఐఎం మద్దతు కోరే అవకాశం ఉందట. మైనార్టీ అభ్యర్థికి ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీ తీరును ఎక్స్పోజ్ చేయొచ్చని భావనలో కారు పార్టీ నేతలు ఉన్నారట. ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే..వారు ఎవరికి ఓటేస్తారో మరోసారి స్పష్టం కానుందని..వాళ్లను కూడా ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ చేసినా బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు.
మరో ముగ్గురి మద్దతు అవసరం ఉంటుంది. అయితే గెలవలేకపోయినా పోటీకి దిగాలని కారు పార్టీ భావించడానికి లెక్కలు వేరే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది ఆ పార్టీ ఏజెంట్‌కు తప్పకుండా చూపాల్సి ఉంటుంది.
అలా చూపకపోతే వాళ్ల ఓటు చెల్లదంటున్నారు. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేలు ఎలాగూ కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారి తీరును మరోసారి ఎండగట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట గులాబీ లీడర్లు. మైనార్టీ క్యాండిడేట్‌ను బరిలోకి దింపడం ద్వారా ఎంఐఎం వైఖరి కూడా స్పష్టమవుతుందని భావిస్తున్నారట. బీఆర్ఎస్ రాజ్యసభ రేసులో నిలుస్తుందా.? ఒకవేళ గులాబీ పార్టీ క్యాండిడేట్‌ను పెడితే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.
