‘మా’ గురించి మంచి ఉంటే మైక్‌లో.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం: చిరంజీవి

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నూతన సంవత్సరమే కాకుండా కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టామనే విషయాన్ని అందరూ గ్రహించాలని అన్నారు. ఈ దశాబ్దం అంతా గొప్పగా సాగాలనే సంకల్పంతో ముందుకెళ్లాలని, ఈ దశాబ్దం మొత్తం ఏం చేయాలో భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్వప్రయోజనాలను పక్కన పెట్టి కళామతళ్లికి సేవ చేసుకోవాలన్నారు.
ఈ డైరీని 20ఏళ్లుగా ప్రింట్ చేస్తూనే ఉన్నామని, మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నామని అన్నారు. మురళీమోహన్‌ను అధ్యక్షుడిగా పనిచేయాలని సూచిస్తే మీకు గ్లామర్ ఉంది. ఆ పదవికి మీరే అర్హులు అన్నారని, అప్పుడు పట్టుబట్టి, జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ముందుకు నడిపించారని అన్నారు.
ఆర్టిస్ట్‌లు ప్రతి ఒక్కరితో చక్కని సమన్వయం చేసుకుంటూ వెళ్లడంతోనే అసోసియేషన్ ముందుకు సాగిందని అన్నారు. ఆర్టిస్టుల ఫోన్ నంబర్లతో కూడిన డైరీని అప్పటి నుంచి ప్రింట్ చేస్తున్నాం అని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే ఆర్టిస్టులకు ఉపయోగపడేలా డైరీని రూపొందించామని అన్నారు. ఆర్టిస్టులకు పెన్షన్లు, ఇన్సూరెన్స్ తదితర కార్యక్రమాలను తర్వాతి కాలంలో ప్రారంభించినట్లు చెప్పారు.
మా అసోసియేషన్ కోసం భూమి కోసం మంత్రి కేసీఆర్‌ను రిక్వెస్ట్ చేశాను. మాలో కొన్ని కుమ్ములాటలు, అంతర్గత విభేదాల కారణంగా అది వాయిదా పడింది. తమిళ పరిశ్రమలో నడిగర సంఘం గొప్పగా ఫండ్ క్రియేట్ చేసింది. కన్నడలో కూడా బాగా సాగుతుంది. పేద ఆర్టిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. కానీ మన సంఘంలో మాత్రం లుకలుకలు రావడం బాధ కలిగిస్తుందని అన్నారు. ‘మా’ గురించి మంచి ఉంటే మైక్‌లో చెప్పుకుందాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం.. అని అన్నారు. మీడియా ఎలా ఉంటది అంటే ఆకలిగా ఉన్న పులులు వాళ్లు మన నుంచి లీకులు వస్తే వదలరు. దయచేసి జాగ్రత్తగా ఉండాలని అన్నారు.