Kavitha Press Meet : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్.. నాన్నా అంటూ.. కేసీఆర్‌కు కవిత ఓ విజ్ఞప్తి..
Kavitha Press Meet : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై కీలక కామెంట్స్ చేశారు.

MLC Kavitha
Kavitha Press Meet : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై కీలక కామెంట్స్ చేశారు. జై తెలంగాణ నినాదంతో ప్రెస్ మీట్ ను కవిత స్టార్ట్ చేశారు.
నిన్న మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వచ్చింది. నాపై అక్రమ కేసులు పెడితే ఐదున్నర నెలలు తీహార్ జైలు ఉన్నా. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నేను.. అనేక కార్యక్రమాలు చేపట్టా. ఓ బిడ్డ హాస్టల్ లో చనిపోతే అక్కడికి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమం చేశా, మహిళలకు రూ.2500 ఇవ్వాలని పోస్టు కార్డు ఉద్యమం చేశానని కవిత అన్నారు. ఇవన్నీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయో చెప్పాలని కవిత అన్నారు.
కేసీఆర్‌కు నేను రాసిన లేఖ లీక్ కాకముందు.. ఒక మహిళా ఎమ్మెల్సీ అయిన తనపై బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని కొందరు కుట్రలు చేస్తున్నారని నేనే అంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కనీసం నాకు ఫోన్ చేసి ఏమైందని అడగలేదని కవిత అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, నేను.. మాది ఒక కుటుంబం. మాది రక్త సంబంధం. పదవులు పోతేనో.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తోనో పోయేటువంటి బంధం మాదికాదు. కానీ, ఎవరైతే పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో.. వ్యక్తిగత లబ్ధిపొందాలనే ఆలోచన కలిగిన వ్యక్తులకు కావాల్సింది మేము ముగ్గురం కలిగి ఉండకూడదని.. మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్లకు అధికారం వస్తందని వారి ఆలోచన. దానిలో భాగంగానే మొదటి స్టెప్ పడింది. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఈ సందర్భంగా నేను కేసీఆర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న అంటూ కవిత కోరారు.
నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు.. నేను మీలా నిజాలు మాట్లాడుతా. నన్ను ఇవాళ బలి చేశారు. కానీ, రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు.. మీకు కూడా పొంచి ఉందంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని కొందరు వాళ్ల హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను తప్పించడం జరిగిందని కవిత ఆరోపించారు.
అప్పటి నుంచే నాపై కుట్రలు..
ఎప్పుడైతే హరీశ్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేశారో అప్పటి నుంచే మా కుటుంబంపై కుట్రలు మొదలయ్యాయని కవిత అన్నారు. హరీశ్ రావు రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యాక మా కుటుంబాన్ని విడగొట్టాలని ప్లాన్ షురూ అయిందంటూ కవిత ఆరోపించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి, హరీశ్ రావులు చెప్పాలి.. ఒకే విమానంలో మీరిద్దరూ కలిసి వచ్చారా.. రాలేదా..? అంటూ కవిత ప్రశ్నించారు.
హరీశ్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అంటారు. కానీ, హరీశ్ రావు గురించి మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. హరీశ్ రావు, సంతోష్ రావులేనని కారణమని కవిత అన్నారు.
హరీశ్ రావు కేసీఆర్‌తో మొదటి నుంచిలేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలోకూడా ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్‌కు హరీశ్ రావు కట్టప్ప లాగా అంటారు. హరీశ్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను.. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా..? అంటూ కవిత కంటతడి పెట్టారు.