Mega 158: మెగా 158 నిర్మాతలకు చిరు అదిరిపోయే ఆఫర్.. బ్యాకప్ కోసం పక్కా ప్లాన్
మెగా 158(Mega 158) సినిమా కోసం ఫైనాన్సియల్ బ్యాకప్ సెట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.
Chiranjeevi setting financial backup for Mega 158 movie to prevent financial difficulties
- నిర్మాతలకు అండగా మెగాస్టార్
- మెగా 158 కోసం బ్యాకప్ నిర్మాతలు
- తగ్గేదే లే అంటున్న కేవీఎన్ సంస్థ
Mega 158: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న ‘మెగా 158(Mega 158)’ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కె.వి.ఎన్ (KVN) ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వారు నిర్మించిన ఇతర భారీ చిత్రాల విడుదల వాయిదా పడటం, పైరసీ లీక్ వంటి సమస్యల వల్ల ఈ బ్యానర్ ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, వెనకడుగు వేయకుండా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పట్టాలెక్కించేందుకే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.
నిర్మాతల పరిస్థితిని గమనించిన చిరంజీవి, వారికి ఒక సజెషన్ ఇచ్చారట. “ముందు మీ సమస్యలను పరిష్కరించుకోండి, అనవసరమైన ఒత్తిడి తీసుకోవద్దు.. కావాలంటే మనం తర్వాత కలిసి పని చేద్దాం” అని ఆయన వారికి భరోసా ఇచ్చారట. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు సహజమని, వాటిని అధిగమించడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మాత్రం ఈ నెల రోజుల్లో సమస్యలను చక్కదిద్దుకుని త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు.
ముందస్తు జాగ్రత్తగా, ఒకవేళ ఆర్థిక సమస్యలు మళ్ళీ వస్తే ప్రాజెక్ట్ ఆగకుండా ఉండేందుకు చిరంజీవి కొందరు సీనియర్ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బ్యాకప్ ప్లాన్‌లో భాగంగా ఇతర అగ్ర నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
