అమితాబ్ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటూ డబ్బావాలాల ప్రత్యేక పూజలు..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులతోపాటు దేశంలోని కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని ముంబైలోని వందలాది మంది డబ్బావాలాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు సుభాష్ తలేకర్ సారధ్యంలో యాగం నిర్వహించారు.
అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని, కరోనా యోధులకు దేవుడు బలాన్ని చేకూర్చాలని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమితాబ్ కరోనా నుంచి కోలుకోవాలని దేశంలోని పలుప్రాంతాల్లోని అభిమానులు పూజలు చేస్తున్నారు. అలాగే అమితాబ్ కుటుంబం త్వరగా కోలుకోవాలని పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కాగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల ఆరోగ‍్యం ప్రస్తుతం స్థిమితంగా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.