దర్బార్ మూవీ రివ్యూ

దర్బార్ ఫక్త్ రజనీకాంత్ సినిమా. కబాలీ, కాలా సినిమాలు డైరక్టర్ సినిమాలు. అభిమానుల్నీ తన మార్కెట్ నీ డిస్ట్రబ్ చేస్తున్నాననుకున్న రజనీ మళ్లీ పాత రూటుకే వెళ్లాలనుకున్నాడు. పేట ఓ మేరకు యుటర్న్ కు ఉపయోగపడితే … దర్బార్ పూర్తి స్థాయిలో రజనీని ఆవిష్కరించింది.కథ విషయంలో మురుగదాస్ కు చెప్పగలిగిన మాట ఒక్కటే పాత రజీనిని చూపిస్తా అంటే పాత కథతో కాదని ఆయన అర్ధం చేసుకుంటే చాలు.
డైరక్టర్ మురుగదాస్ కూడా కథను పూర్తిగా రజనీ ఇమేజ్ చుట్టూనే రాసుకుంటూ వెళ్లాడు. ఓ వేరియేషన్ కోసం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రజనీతో కాఖీ డ్రస్ వేయించాడు. ముంబై డాన్స్ ప్రాభవంతో పెరిగిపోయిన డ్రగ్ అండ్ గన్ కల్చర్ కు చరమగీతం పాడడం కోసం, ఆదిత్య అరుణా చలం అనే ఓ సూపర్ పోలీస్ ను ముంబై పోలీస్ కమిషనర్ గా పంపిస్తారు. ఆయన పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో సహా ముంబైలో దిగుతాడు.
దిగ్గానే డ్రగ్ మాఫీయా మీద దృష్టి సారిస్తాడు. ఆ క్రమంలో ప్రధాన విలన్ కొడుకు దొరికిపోతాడు.అతన్ని ఆ కేసులోంచీ తప్పించడానికి చేసిన ప్రయత్నం కూడా కమిషనర్ కు తెల్సిపోతుంది. ఆ సందర్భంగా విలన్ కొడుకును కమిషనర్ చంపేస్తాడు. తన కొడుకును చంపిన వాడి మీద పగ తీర్చుకోడానికి విలన్ ఇండియా వస్తాడు. వచ్చీ రాగానే కమిషనర్ కూతురును చంపేస్తాడు. అక్కడ నుంచీ కమిషనర్ పర్సనల్ రివేంజ్ ప్లస్ డిపార్ట్ మెంట్ కు తానిచ్చిన హామీ ఏదీ సగంలో వదిలేయను పూర్తి చేసే వస్తాను అనే మాటను కూడా నిలబెట్టుకోవడమే సినిమా.
క్లుప్తంగా ఇది ఒక రివేంజ్ డ్రామా. ఇరవై ఏళ్ల క్రితం ముంబైలో ఓ డాన్ చేతుల్లో చనిపోయిన పోలీసు అధికారుల చావుకు రివేంజ్ తీర్చుకోడానికి వచ్చిన హీరో విలన్ కొడుకును చంపేస్తాడు. కొడుకును చావుకు రివేంజ్ గా విలన్ హీరో కూతుర్ని చంపేస్తాడు. తన కూతురు చావుతో పాటు ఒరిజినల్ రివేంజ్ తీర్చుకోడానికి హీరో విలన్ ను చంపేస్తాడు.ఈ చావుల క్రమాన్ని ఇంట్రస్టింగ్ గా నడపడానికి స్క్రీన్ ప్లే రైటర్ కమ్ డైరక్టర్ మురుగదాస్ కొంచెం పెద్ద కసరత్తే చేశారు. ఓ చిన్న లవ్ ట్రాక్ పెట్టాడు. దాన్ని కూడా అత్యంత గౌరవప్రదంగానే నడిపాడు. యాక్షన్ , ఎమోషన్స్ తో పాటు కామెడీ బాధ్యత కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు రజనీకాంత్.
దర్బార్ మూవీలో రజనీకాంత్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు . నిజానికి తను మొహమాటపడుతున్నాడుగానీ … ఈ సారి మరీ పెళ్లీడుకొచ్చిన కూతురున్న కారక్టర్ కాదు యంగ్ హీరోగానే చేసేయొచ్చు అనే హోప్ ఇచ్చాడు. ఫెర్మామెన్స్ పరంగా నివేదా ధామస్ రజనీ కూతురు పాత్రలో చాలా బాగా నటించింది. ముఖ్యంగా తండ్రి కోమాలో ఉండి … తను చావుకు దగ్గరవుతున్నాననే విషయం తెల్సినప్పుడు ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో నివేద చాలా బాగా పెర్ఫామ్ చేసింది. విలన్ గా సునీల్ షెట్టి చాలా బాగా యాక్ట్ చేశాడు. అయితే ఆ పాత్రకున్న పరిధి చాలా తక్కువ. అందులోనే తను నటించే సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండాలనే తపనతో నటించిన విషయం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. నయనతార కేవలం గ్లామర్ కోసమే ఉంది. ఆ బాధ్యత బాగా నిర్వర్తించింది.
సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ చాలా బావుంది. సూపర్ స్టార్ ను చాలా అందంగా చూపించారు. టెక్నీషియన్స్ లో మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ద్ కూడా సూపర్ స్టార్ కోసం మాస్ బీట్ బాగా మోగించాడు. ముఖ్యంగా దుమ్ము ధూళి పాట బాలుతో పాడించడం చాలా బాగుంది. బాల సుబ్రహ్మణ్యం కూడా రజనీని మించిన ఎనర్జీతో పాడి అదరగొట్టాడు. అనిరుద్ద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది.
డైలాగ్స్ అనువాదం విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బాగుండేది. శ్రీ రామకృష్ణ లాంటి చేయి తిరిగిన డబ్బింగ్ రైటర్ నుంచీ ఎక్స్ పెక్ట్ చేయలేని స్థాయిలో భాష ఉంది. పాటల అనువాదం విషయంలో కూడా ఇదే తప్పు దొర్లిపోయింది. ఈ ఒక్క విషయం తప్ప మిగిలిన వ్యవహారమంతా దర్శకుడు మురుగదాస్ బాగానే చక్కబెట్టారు. నిజానికి రజనీ కోసం తన పద్దతిని పూర్తిగా మార్చుకుని చేసిన సినిమా దర్బార్. టైటిల్ సెలక్షన్ కూడా చాలా యాప్ట్ గా అనిపించింది.
దర్బార్ లో రాజుగారు చెప్తారు ప్రజలు వింటారు. మంత్రులు తదితర పెద్దలు ఉంటారుగానీ వారు కూడా రాజుగారు చెప్పిందే వింటారు. అలా ఇది రజనీకాంత్ దర్బార్ డిజైన్డ్ బై మురుగదాస్ అని చెప్పుకోవాలి. దుమ్ము రేపింది అనేది హిట్టు సినిమాల విషయంలో చాలా కాలంగా వాడుతూన్న పదమే. కనుక బాక్సాఫీసు దగ్గర దర్బార్ ఏ మేరకు దుమ్మురేపుతుందో చూడాలి. లైకా రిలయన్స్ భాగస్వామ్యంలో రూపొందిన దర్బార్ లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావున్నాయి .. అందుకు నిర్మాత సుభాస్కరన్ ను అభినందించాలి. ఓవరాల్ గా రజనీకాంత్ మరో సారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల కోసం అలాగే తన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం చాలా కష్టపడి ఈ సినిమా చేశారనేది మాత్రం వాస్తవం.
ప్లస్ పాయింట్స్ :
రజనీకాంత్ నటన, ఎనర్జీ లెవెల్స్
నివేదాథామస్, సునిల్ శెట్టి పెర్ఫామెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
కథ
సెకండ్ హాఫ్
రొటీన్ క్లైమాక్స్
విలన్ క్యారెక్టరైజేషన్