Karunakaran: ఎనిమిదేళ్ల తర్వాత ‘తొలిప్రేమ’ దర్శకుడి రీ-ఎంట్రీ.. క్రేజీగా కొత్త ప్రాజెక్ట్
దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత కొత్త సినిమా చేస్తున్న దర్శకుడు కరుణాకరన్(Karunakaran).
Director karunakaran doing his next movie with bellamkonda ganesh
- మళ్ళీ మెగాఫోన్ పట్టనున్న కరుణాకరన్
- బెల్లంకొండ గణేష్‌తో సెన్సిబుల్ మూవీ.
- మరోసారి లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీతోనే
Karunakaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వచ్ఛమైన ప్రేమకథలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు కరుణాకరన్ టాప్ లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘తొలిప్రేమ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత యువకుడు, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట వంటి సినిమాలతో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేయడంలో తనకు సాటిలేరని నిరూపించుకున్నారు. కరుణాకరన్(Karunakaran) సినిమాల్లో ఉండే ఫీల్ గుడ్ అంశాలు, సున్నితమైన హాస్యం యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.
చివరగా ఈ దర్శకుడు సాయి ధరమ్ తేజ్‌తో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా చేశాడు. ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నాడు కరుణాకరన్. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యంగ్ హీరో బెల్లంకొండ గణేష్‌తో జతకట్టబోతున్నట్లు సమాచారం. స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సార్ వంటి చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్.
ఇప్పుడు కరుణాకరన్ మార్క్ లవ్ స్టోరీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా కూడా ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. చాలా కాలం తర్వాత కరుణాకరన్ ఒక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో తిరిగి వస్తుండటంతో, ఈసారి ఆయన ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారోనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరి ఈసారైనా ఈ దర్శకుడు హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.
