థీమ్ చెప్పేశాడు.. ఇక తెరమీద చూడ్డమే..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 09:58 AM IST
థీమ్ చెప్పేశాడు.. ఇక తెరమీద చూడ్డమే..

Updated On : April 27, 2020 / 9:58 AM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస అద్భుత విజయాలతో ఏస్ డైరెక్టర్‌గా పేరుగాంచిన ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం..‘రౌద్రం రణం రుధిరం’ (RRR).. స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌తో పాటు Bheem For Ramaraju పేరుతో రిలీజ్ చేసిన చరణ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ RRR సినిమా కథ యొక్క కీలకమైన మెయిన్ థీమ్‌ని రాజమౌళి వెల్లడించారు. నీరు, అగ్ని అనేవి రెండూ ఒకదానిని మరొకటి నాశనం చేయగల విభిన్నమైన శక్తివంతమైన స్వభావం కల్గినవి, అదే ఒకవేళ అవి రెండూ కలిస్తే కనుక యావత్ ప్రపంచం మొత్తాన్ని ఒక మోటార్ మాదిరిగా ముందుకు నడిపించగలవు అని రాజమౌళి చెప్పారు. కాగా ఆయన వెల్లడించిన ఈ థీమ్‌ని కాసేపటి క్రితం ఈ సినిమా నిర్మాతలైన డివివి ఎంటర్టైన్మెంట్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్లో హీరోలిద్దరిలో ఒకరిని అగ్నిగా, మరొకరిని నీరుగా చూపించి, చివర్లో ఇద్దరూ చేతులు కలుపుతున్న విధంగా చూపించారు. కాగా అదే ఈ సినిమా మెయిన్ థీమ్ అని స్వయంగా జక్కన్న చెప్పడంతో ఈ సినిమాని రాజమౌళి ఎంత అద్భుతంగా తీస్తున్నారా.. అని సినీ వర్గాల్లో, ప్రేక్షకాభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 2021 జనవరి 8న ‘రౌద్రం రణం రుధిరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.