కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ కలకలం..వణికిపోతున్న స్టార్స్

కన్నడ చిత్ర సీమలో కలకలం రేగుతోంది. ఒంటిచేత్తో విలన్లను మట్టి కరిపించే హీరోలు ఇప్పుడు గజగజలాడిపోతున్నారు. రెబల్ హీరోయిన్లు కూడా ఇప్పుడు సైలెంటైపోయారు. బాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ తుపాను ఇప్పుడు శాండిల్‌వుడ్‌ను వణికిస్తోంది. ‘అడా ఉంటా-ఈడాఉంటా’ అన్నట్లు కన్నడ చిత్ర సీమను కమ్మేసిన డ్రగ్స్ మత్తును వదిలించే పనిలో పడ్డారు పోలీసులు.
కర్ణాటక నేర నియంత్రణ విభాగం డ్రగ్స్‌పై జరుపుతున్న విచారణలో కన్నడ సినీ నటీనటుల పేర్లు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. వారం రోజులుగా 20 మందిని ప్రశ్నించిన పోలీసులు ఈ కేసులో శాండిల్‌వుడ్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రాగిణి ద్వివేది నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియాతో ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసుల దగ్గర ఆధారాలున్నట్లు తేలింది. ఆమె అందుబాటులో లేకపోవడంతో వాట్సప్‌లో నోటీసులు జారీచేశారు. గురువారమే విచారణ కు హాజరుకావాలని కోరినా రాగిణి సోమవారం వస్తానని చెప్పారు. అయితే ఇందుకు పోలీసులు నిరాకరించి మరోమారు నోటీసులు జారీ చేశారు.
ఇటు రాగిణి ద్వివేది స్నేహితుడు రవిశంకర్, మరో నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. రాహుల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మొబైల్‌లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో ఎవరెవరికి నోటీసులు వస్తాయోనన్న టెన్షన్ పట్టుకుంది.
బెంగళూరు నగరంలో నార్కొటిక్స్ బ్యూరో జరిపిన సోదాలతో అసలు విషయం బయటకు వచ్చింది. ముగ్గురు డీలర్లను అరెస్ట్ చేసి విచారిస్తే శాండిల్‌వుడ్ డొంక కదిలింది. గాయకులు, నటులకు తాము డ్రగ్స్ సరఫరా చేసినట్లు వారు అంగీకరించారు. కన్నడ చిత్రసీమ దర్శకుడు, జర్నలిస్టు ఇంద్రజిత్ లంకేశ్ పోలీసులకు ఇచ్చిన సమాచారంలో షాకింగ్ విషయాలున్నట్లు తెలుస్తోంది.
రెండ్రోజులు విచారణకు హాజరైన ఆయన కనీసం 20మంది నటీనటుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మత్తు పదార్థాలతో సంబంధాలున్న నటీనటులు భయంతో వణికిపోతున్నారు. సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరిగి సైతం మాదక ద్రవ్యాల వ్యవహారంతో సంబంధమున్న నటీనటుల పేర్లను బహిరంగ పరుస్తూ కలకలం సృష్టిస్తున్నారు.
సంజన, రాగిణిల పేర్లు కూడా ఆయన బయటపెట్టారు. ఆయన ఏకంగా శాండల్‌వుడ్ డ్రగ్స్ మాఫియాకు బాలీవుడ్‌తో సంబంధాలున్నట్లు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్‌తో సంబంధాలున్న ఇంతియాజ్ ఖాత్రిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇంతియాజ్ ఖాత్రితో బాలీవుడ్ నటీనటులు, నిర్మాతలకు మంచి సంబధాలున్నాయి. అతని పుట్టినరోజుకు సినీరంగ ప్రముఖులు హాజరవుతుంటారు.
Karnataka: A search by Central Crime Branch (CCB) is underway at the residence of Kannada actress Ragini in Bengaluru, in connection with a drug case. pic.twitter.com/4HtUqTUwrq
— ANI (@ANI) September 4, 2020