Mahesh Babu: హీరో మహేశ్ బాబుకు షాక్.. ఈడీ నోటీసులు జారీ
సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టుకు మహేశ్ బాబు అంబాసిడర్‌గా ఉన్నారు.

Mahesh Babu
సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న విచారణకు రావాలని ఆదేశించింది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టుకు మహేశ్ బాబు అంబాసిడర్‌గా ఉన్నారు.
వాటిల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మహేశ్ బాబు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారన్న అభియోగంపై ఆయనకు నోటీసులు అందాయి. మహేశ్‌కు సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు సంస్థలు ఇచ్చిన రెమ్యూనరేషన్‌పై ఈడీ విచారిస్తుంది.
కాగా, స్థిరాస్తి ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయలేదన్న ఆరోపణలు రావడంతో సురానా గ్రూపుతోపాటు స్థిరాస్తి నిర్మాణ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ జరుపుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఆయా సంస్థ నిర్వాహకుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
సాయిసూర్య డెవలపర్స్ కు చెందిన కంచర్ల సతీశ్ చంద్ర గుప్తా పోలీస్ కేసును కూడా ఎదుర్కొంటున్నారు. వెంగళ్రావునగర్ అడ్రస్సుతో ఉన్న ఓ ప్రాజెక్టులో తమను మోసం చేశారని కొందరు సతీశ్ చంద్రగుప్తాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినీ నటుడితో ప్రచారం చేయించారని, దీంతో తాము నమ్మామని అన్నారు. 2021లో షాద్‌నగర్‌లోని 14 ఎకరాల స్థలంలో వెంచర్ కోసం రూ.3 కోట్లు కట్టామని చెప్పారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సురానా గ్రూప్ నిర్వాహకుడు నరేంద్ర సురానా నివాసంలోనూ సోదాలు చేసింది.
స్థిరాస్తి వ్యాపారం పేరుతో మోసగించి, ఆ డబ్బును మళ్లించారనే ఆరోపణలపై ఈడీ సురానా గ్రూపు ఆఫీసులు, నరేంద్ర సురానా నివాసంలో నిర్వహించిన సోదాల్లో అనధికారిక లావాదేవీల గురించి తెలిసింది. ఆ సంస్థ వసూలు చేసిన డబ్బు దాదాపు రూ.100కోట్ల మేర ఉన్నట్లు ఈడీకి ఆధారాలు దొరికాయి. నరేంద్ర సురానా నివాసంలో రూ.74.5 లక్షలను ఈడీ జప్తు చేసింది.
వాణిజ్య ప్రకటనలకు మహేశ్ బాబుకు రూ.5.9 కోట్లు?
సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో పలు ఆధారాలను సేకరించిన అధికారులు.. దాని ప్రకారం మహేశ్ బాబుకు నోటీసులు పంపారు. ఆయా కంపెనీల వాణిజ్య ప్రకటనలకు మహేశ్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబు చేసిన ప్రకటనలను చూసి.. ఆయా రియల్ ఎస్టేట్ సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేశ్ బాబుకు నోటీసులు ఇచ్చారు.