Fahad Faasil : మేమెన్ని హిట్స్ కొట్టినా మలయాళం సినిమాలను ఓటీటీలు పట్టించుకోవట్లేదు..
ఫాహద్ ఫాజిల్ ఆవేశం సినిమా 100 కోట్ల హిట్ కొట్టడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మలయాళ సినిమాల గురించి మాట్లాడారు.

Fahad Faasil Sensational Comments on OTT platforms regarding Malayalam Movies
Fahad Faasil : ఇటీవల మలయాళం సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో, కొత్త కథలతో తెరకెక్కిన మలయాళం సినిమాలు కేవలం కేరళలోనే కాక అన్ని భాషల్లో హిట్ కొడుతున్నాయి. రోమాంచమ్, 2018, నేరు, హృదయం, మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, భ్రమయుగం.. ఇప్పుడు ఆవేశం.. ఇలా అనేక సినిమాలు సూపర్ హిట్స్ కొట్టాయి. మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు అయితే తెలుగులో కూడా ఏకంగా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసాయి.
దీంతో ఇటీవల మలయాళం సినిమాలపై మంచి అంచనాలు ఉంటున్నాయి. అన్ని పరిశ్రమ ప్రేక్షకులు మలయాళ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ అవ్వకపోతే ఓటీటీలో చూస్తున్నారు. అయితే గతంలో మలయాళ హీరో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఫహద్ ఫాజిల్ చేశారు. ఫాహద్ ఫాజిల్ ఆవేశం సినిమా 100 కోట్ల హిట్ కొట్టడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మలయాళ సినిమాల గురించి మాట్లాడారు.
ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ఇటీవల మలయాళ సినిమా బిజినెస్ పెరిగింది. అయినా మాకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ నుంచి సపోర్ట్ లేదు. మలయాళంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల 80 శాతం సినిమాలు ఓటీటీకి రిలీజ్ ముందే అమ్ముడుపోతున్నాయి. కానీ మా దగ్గర అలా లేదు. మేము సినిమా రిలీజ్ చేసి హిట్ కొడితే తప్ప మా దగ్గరికి ఓటీటీలు రావట్లేదు. దీని వల్ల మా పరిశ్రమలో ఇంకా మంచి సినిమాలు చేయాలనే కసి పెరిగింది అని అన్నారు. గతంలో 2018 సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా టోవినో థామస్ మాట్లాడుతూ.. సినిమా హిట్ అయితేనే ఓటీటీలు వస్తున్నాయి, బయట వాళ్ళు కూడా మా సినిమాని ముందే కొనుక్కొవట్లేదు. ఇక్కడ హిట్ అయ్యాకే కొంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఫాహద్ కూడా ఇలాగే మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.