Singer SP Balu : ఎస్పీ బాలుకు టాలీవుడ్ స్వరనీరాజనం

గాన గంధర్వుడు.. సుమధుర గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ  జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతోంది.

Singer SP Balu : ఎస్పీ బాలుకు టాలీవుడ్ స్వరనీరాజనం

Singer Sp Balu

Updated On : May 30, 2021 / 1:34 PM IST

Singer SP Balu : గాన గంధర్వుడు.. సుమధుర గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ  జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతోంది.  బాలు 75వ జయంతి (డైమండ్ జూబ్లీ) రోజున జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలుగు సినిమాకే కాక భారతీయ సినిమాకి బాలు చేసిన సేవలను గుర్తు చేస్తూ   టాలీవుడ్  ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు … దాదాపు 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రాంను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర సీమలోని అతిరథమహారథులైన హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాల్గోంటున్నారు. యావత్ తెలుగు చిత్రసీమ ఒక్క తాటిపైకి వచ్చిఇంటర్నెట్ వేదికగా చేపడుతున్న బృహత్తర కార్యక్రమమిది.

బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ చెప్పారు. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలుగారు చేసిన సేవల్ని గుర్తుచేస్తూ సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొంటున్నారని…. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్‌గా కొనసాగుతుందని చెప్పారు. దీనికి పరిశ్రమ అంతా సహకరిస్తోంది. సంగీతాభిమానులు, బాలుగారి అభిమానులు ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు.

జూన్ 4న బాలుగారికి పెద్ద ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ చేయాలని నిశ్చయించుకున్నామని…. ఇందులో ఇండస్ట్రీ అంతా పాల్గొంటోందని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా సినీరంగానికి చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. నాన్ స్టాప్‌గా జరిగే ఈ ప్రోగ్రామ్‌ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈకార్యక్రమానికి సంబంధించి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటామని పట్నాయక్ తెలిపారు.