Happy Birthday సూపర్ స్టార్ రజినీకాంత్.. 1988లోనే హాలీవుడ్‌కు.. జపాన్ పార్లమెంట్‌లో.. క్రేజ్ అంటే ఇదే అనేలా!

  • Published By: vamsi ,Published On : December 12, 2020 / 10:34 AM IST
Happy Birthday సూపర్ స్టార్ రజినీకాంత్.. 1988లోనే హాలీవుడ్‌కు.. జపాన్ పార్లమెంట్‌లో.. క్రేజ్ అంటే ఇదే అనేలా!

Updated On : December 12, 2020 / 10:34 AM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవుడిలా ఆరాధించే సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్, హలీవుడ్ అని తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీల్లో స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ పుట్టినరోజు ఈ రోజు. క్రేజ్ అంటే ఇది కదా? అని అనుకునేలా.. పేరుకి తమిళ హీరోనే కానీ, దేశమంతా.. విదేశాల్లోనూ ఆయనకు అభిమానులే. జపాన్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో కూడా ఆయనకు బోలెడంత మంది ఫ్యాన్. 70వ పడిలోకి అడుగుపెట్టిన రజినీకాంత్.. బెంగళూరులో 12 డిసెంబర్ 1950లో జన్మించాడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.

ఐదేళ్లకే తల్లిని కోల్పోయి.. కండెక్టర్‌గా:
బస్ కండెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజినీకాంత్.. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామోజీ రావు గైక్వాడ్.. తల్లి జిజాబాయి రజినీకాంత్‌కు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోయింది. బెంగళూరు రవాణా సేవలో బస్సు కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 1973 లో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో డిప్లొమా తీసుకున్నాడు. కన్నడ నాటకాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన రజినీకాంత్.. మహాభారతంలో దుర్యోధనుడిగా చేశాడు. తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించేందుకు తమిళ భాషను నేర్చుకున్నారు.

80 వ దశకంలో అంధా కనూన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘అదాలత్’, ‘జాన్ జానీ జనార్దన్’, ‘భగవాన్ దాదా’, ‘దోస్తీ దుష్మాని’, ‘ఇన్సాఫ్ కౌన్ కరేగా’, ‘రియల్ ఫేక్’, ‘హమ్, బ్లడ్ డెట్’, ‘రివల్యూషనరీ’, ‘బ్లైండ్ లా’ ‘చల్బాజ్’, ‘గాడ్ ఆఫ్ ఇన్సానియాట్’ వంటి హిందీ చిత్రాలు ఆయనకు బాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. రజినీకాంత్ 1988లోనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. బ్లడ్ స్టోన్ అనే సినిమాలో రజినీకాంత్ ప్రత్యేకమైన పాత్రలో నటించారు.

విలన్‌గా:
హీరో అంటే కండలు తిరిగిన బాడీతో.. తెల్లగా అందంగా ఉండాలనే కమర్షియల్ ఫార్ములాను పక్కనబెట్టించి.. స్టైల్‌తో మెస్మరైజ్ చేసిన రజినీకాంత్‌కు అవకాశం ఇచ్చింది కె.బాలచందర్. తమిళం నేర్చుకుంటే మంచి అవకాశం ఇస్తానని చెప్పడంతో.. రజినీ కొద్దిరోజుల్లోనే తమిళం నేర్చుకోగా.. 1975లో రజినీకాంత్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సోలో హీరోగా ఎదిగారు. ఒక్క ఏడాదిలో 20కి పైగా సినిమాల్లో నటించారు. తమిళంలో ‘16 వయతినిలె’ (తెలుగులో ‘16 ఏళ్ల వయసు’) చిత్రంలో కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించారు. ఇందులో రజినీకాంత్ విలన్‌గా నటించారు.

166 సినిమాల్లో:
తెలుగులో రజినీకాంత్ నేరుగా చేసిన సినిమాల కంటే తమిళ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘దళపతి, బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. రజినీ‌కాంత్ తన 45ఏళ్ల కెరీర్లో 166 సినిమాల్లో నటించారు.

జపాన్ పార్లమెంట్‌లో రజినీకాంత్ గురించి:
రజినీకాంత్ అంటే మనదేశంలోనే కాదు.. ఇతరదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకసారి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2006లో జపాన్‌లోని టోక్యోకు వెళ్లారు. అక్కడ జపాన్ పార్లమెంట్‌లో రజినీకాంత్ ముత్తు సినిమా గురించి ప్రస్తావించగా.. ఒక్కసారిగా సభ్యులు అభిమాన నటుడు పేరు చెబితే అరిచినట్లుగా అరిచారు. ఈ ఒక్క ఘటన రజినీకాంత్ క్రేజ్ గురించి చెబుతుంది. అంతేకాదు.. అనేక కార్పోరేట్ కంపెనీలు మన దేశంలోనే కాదు.. బయట దేశాల్లో కూడా రజినీకాంత్ సినిమా రిలీజ్ రోజు సెలవు ప్రకటిస్తాయి. ”కబాలి”, రోబో సినిమాల సమయంలో కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించాయి.