వరుస ఫ్లాప్‌లు, వందల కోట్ల నష్టాలు.. సంక్షోభం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ బయటపడేదేలా?
నెల రోజులు షూటింగ్ నడిస్తే 6 కోట్ల వరకు పైఖర్చులే అవుతున్నాయని అంచనా. ఇలా అయితే రాబోయే రోజుల్లో ఇంకా బడ్జెట్ పెరిగి..బాలీవుడ్ సినిమాలకు ప్రాఫిట్ అన్నదే ఉండదని అలర్ట్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు.

Bollywood Cost Cutting : ఫ్యాన్స్ కు కిక్ లేదు.. ప్రొడ్యూసర్స్ కు ప్రాఫిట్స్ లేవు. హీరోల రెమ్యునరేషన్ మాత్రం వందల కోట్లు. బాలీవుడ్ లో ఈ మధ్య ఒక్క మూవీకి పెట్టిన ఖర్చు అయితే దిమ్మతిరిగిపోయేలా ఉంది. లిమిట్ అంటూ లేకుండా 100 కోట్లు పెట్టి మూవీ తీస్తే.. తీరా అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రొడ్యూసర్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. వరుస డిజాస్టర్ల నుంచి బయటపడేందుకు కాస్ట్ కటింగ్ మీద ఫోకస్ పెట్టారు నిర్మాతలు.
90శాతం మూవీస్ దారుణమైన నష్టాలు చూశాయి..
హిస్టారికల్, ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్, మైథలాజికల్.. జాన ఏదైనా, మూవీ ఏ హీరోదైనా ఫైనల్ రిజల్ట్ ఫ్లాప్‌గా మిగులుతోంది. బాలీవుడ్‌లో గత రెండేళ్లలో వచ్చిన సినిమాల్లో 90శాతం మూవీస్ దారుణమైన నష్టాలను చూశాయి. రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం 50కోట్లు రాని మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు పదుల సంఖ్యలో మూవీస్ డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది.
500 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసినా.. హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు..
ఒకప్పుడు 100కోట్ల బడ్జెట్ అంటే అమ్మో అంత బడ్జెటా..? అని నోరెళ్ల పెట్టే వాళ్లు. ఇప్పుడు ఒక్కో హీరోయే 100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. మరి హీరోయే 100కోట్లు తీసుకుంటే .. డైరెక్టర్ , హీరోయిన్ , మ్యూజిక్ , టెక్నీషియన్స్ , ప్రొడక్షన్ ..అన్నీ కలిపి ఎన్ని వందలకోట్ల బడ్జెట్ అవుతుంది..? తీరా 500కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినా ..అది హిట్ అవుతందన్న గ్యారెంటీ లేదు. పోనీ ఒక ఫ్లాప్ అంటే ఏదో విధంగా కోలుకోవచ్చు. వరుస పెట్టి ఓ ప్రొడ్యూసర్‌కు నాలుగు ఫ్లాప్‌లు తగిలితే.. ఇక కథ కంచికే అన్నట్లు అయింది పరిస్థితి.
సినిమా పూర్తయ్యే సరికి ఒక్క హీరో మీదనే 120 కోట్ల వరకు ఖర్చు..
ఏ ఇండస్ట్రీలో అయినా..మూవీ మొత్తం బడ్జెట్‌లో హీరో రెమ్యునరేషనే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి నుంచి కాస్ట్ కంటింగ్ స్టార్ట్ చేసింది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ టీమ్. ఒక్కో స్టార్ హీరో రెమ్యునరేషన్ వందకోట్లపైనే ఉంది. వారి క్యారవాన్లు, వారి పర్సనల్ సిబ్బంది ఖర్చు అంతా కలిపి..మూవీ పూర్తయ్యే సరికి ఒక్క హీరో మీదనే 120 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఒక్కో హీరో 9మంది పర్సనల్ సిబ్బందితో సెట్‌కు వస్తారని.. హెయిర్ స్టైలిస్ట్, మెకప్ మెన్, కాస్ట్యూమ్ డిజైనర్.. బాడీ గార్డ్స్ ఇలా ఒక్కొక్కరు రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు తీసుకుంటున్నారని చెప్తున్నారు.
నెల రోజుల షూటింగ్ కు పైఖర్చులే 6కోట్లు..
ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకుని..బ్యాకప్ అయ్యేందుకే కాస్ట్ కటింగ్‌ను స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్లు. హీరోల రెమ్యునరేషనే కాకుండా అతని సిబ్బంది..వాళ్ల క్యారవాన్లు, ఇతర ఖర్చులన్నీ కలిపి రోజుకు 20లక్షల వరకు ఎక్స్ ట్రా ఖర్చు అవుతుండటంతో తడిసి మోపెడవుతోంది. నెల రోజులు షూటింగ్ నడిస్తే 6 కోట్ల వరకు పైఖర్చులే అవుతున్నాయని అంచనా. ఇలా అయితే రాబోయే రోజుల్లో ఇంకా బడ్జెట్ పెరిగి..బాలీవుడ్ సినిమాలకు ప్రాఫిట్ అన్నదే ఉండదని అలర్ట్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు.
250 కోట్లతో తీస్తే.. కనీసం 50 కోట్లు రాలేదు..
మినిమం గ్యారెంటీ హీరోలుగా పేరున్న స్టార్లకు కూడా ఫ్లాపులు తప్పకపోవడంతో.. బాలీవుడ్ ప్రొడ్యూసర్లు పీకల్లోతు నష్టాల్లోకి వెళ్లిపోయారు. అజయ్ దేవగన్ మెయిన్ రోల్‌లో రీసెంట్‌గా వచ్చిన మూవీ మైదాన్ ఫ్లాప్ అయింది. బోనీ కపూర్ ఈ మూవీని నిర్మించారు. పాజిటివ్ టాక్, రివ్యూలతో రిలీజ్ అయిన మూవీ.. ఊహించని విధంగా పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 250 కోట్లు పెట్టి నిర్మించిన ఈ మూవీ.. కనీసం 50 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది.
నిర్మాతలకు రూ.250 కోట్ల నష్టం..
అక్షయ్ కుమార్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 350 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ.. సగం రెవెన్యూ కూడా కలెక్ట్ చేయలేదని బాలీవుడ్ వర్గాల టాక్. ఈ మూవీతో నిర్మాతలకు 250 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా.
డిజాస్టర్‌కు డెస్టినేషన్‌గా బాలీవుడ్..
షారూఖ్ ఖాన్ మూవీ జవాన్, పఠాన్ మూవీస్ తప్ప.. 2023 నుంచి ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకున్న మూవీలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఒకటి రెండు సినిమాలు మినహా..అయితే ఫ్లాప్..మరీ స్టార్ హీరో అయితే యావరేజ్ టాక్ నడుస్తోంది. బాలీవుడ్ సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ మూవీస్, సక్సెస్‌కు కేరాఫ్ అనే సిచ్యువేషన్ నుంచి ..డిజాస్టర్‌కు డెస్టినేషన్‌గా మారిపోయింది.
అప్పుల్లో కూరుకుపోతున్న నిర్మాతలు..
వందల కోట్లతో మూవీ నిర్మించి..చివరకు పెట్టిన డబ్బులు కూడా రాకపోతే.. నిర్మాతల పరిస్థితి ఏంటన్నదానిపై బాలీవుడ్‌లో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఆర్టిస్టులు అంతా బానే ఉంటున్నారు. కానీ వందలకోట్లు పోసి సినిమా తీస్తే చివరకు అప్పులు, ఆవేదనే తప్ప.. ఆస్తులు ఏం ఉండటం లేదని గగ్గోలు పెడుతున్నారు ప్రొడ్యూసర్లు. స్టార్ హీరోల స్టార్ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని..పెద్ద బడ్జెట్, భారీ అంచనాలతో మూవీ నిర్మిస్తే తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటంతో ఆస్తులు అమ్మి.. సినిమాలకు తెచ్చిన అప్పులు కట్టే పరిస్థితి వచ్చిందంటున్నారు ప్రొడ్యూసర్లు. ఒకటి కాదు రెండు కాదు..వందల కోట్ల నష్టం వస్తుండటంతో.. వాటిని పూడ్చుకోవాలంటే ఎన్ని సినిమాలు తీస్తే సాధ్యమవుతుందో అర్థం చేసుకోవాలని హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపుపై కూడా ఫోకస్..
కాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషనే కాదు..ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపుపై కూడా ఫోకస్ పెట్టారు. మల్టిపుల్ క్యారవాన్స్, 10 మంది అసిస్టెంట్లు, ఫ్లైట్ చార్జెస్ వంటి వాటిలో.. కాస్ట్ కటింగ్‌కు రెడీ అయ్యింది బాలీవుడ్ ఇండస్ట్రీ. స్టూడియో, డైరెక్టర్ల ఫీజ్ , లొకేషన్ షూట్స్ వీటన్నింటి మీద కూడా రీవర్క్ చేయాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ భావిస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న బడ్జెట్‌ను కంట్రోల్ చేసి రివైజ్ చేయకపోతే.. బాలీవుడ్‌లో సినిమాలను నిర్మించడం కష్టమవుతుందని చెప్తున్నారు. చూద్దాం మరీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నిర్ణయంపై స్టార్ హీరోల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.
Also Read : గుండెలు పిండే విషాదం.. కలిచివేస్తున్న సీరియల్ నటులు పవిత్ర, చందుల మరణం