Devil Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..

కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది..? రివ్యూ ఏంటి..?

Devil Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..

Kalyan Ram Samyuktha Menon Devil movie Review complete report

Updated On : December 29, 2023 / 9:25 PM IST

Devil Review : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించింది. డెవిల్ నేడు డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే..
స్వాతంత్ర్యానికి ముందు 1945లో రసపాడు అనే ఒక ఊర్లో జమీందారు అమ్మాయి హత్యతో కేసుతో కథ మొదలవుతుంది. ఆ హత్య కేసుని డీల్ చేయడానికి బ్రిటిష్ పోలీసులు డెవిల్(కళ్యాణ్ రామ్)ని పిలిపిస్తారు. డెవిల్ ఆ ఊరికి వెళ్లి హత్యకేసు డీల్ చేయడం మొదలుపెడతాడు. అదే సమయంలో మరో రెండు హత్యలు కూడా అవుతాయి. అయితే డెవిల్ ని ఆ ఊరికి పంపించడానికి అసలు కారణం నేతాజీ కోసం పనిచేసే జమిందార్ ఇంట్లో ఉండే నైషద(సంయుక్త మీనన్) ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవడానికి, నేతాజీ రైట్ హ్యాండ్ త్రివర్ణని పట్టుకోవడానికి. డెవిల్ ఆ ఊరికి వెళ్లి హత్య కేసు ఎలా డీల్ చేశాడు? ఆ హత్య ఎవరు చేశారు? బ్రిటిష్ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కనుక్కున్నారా? త్రివర్ణని పెట్టుకున్నారా? డెవిల్ – నైషదల మధ్య ప్రేమ కథ ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
స్వతంత్రం ముందు కథతో సుభాష్ చంద్రబోస్ పక్కనే ఉండే త్రివర్ణ అనే ఓ వ్యక్తి కల్పిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి హాఫ్ అంతా హత్య కేసు ఛేదించడంతో సస్పెన్స్ థ్రిల్లర్ లా కొనసాగుతుంది. ఇంటర్వెల్ ముందు నుంచి నేతాజీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, త్రివర్ణని పట్టుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు వేసే ప్లాన్స్, వాటికి ఎత్తుగడగా త్రివర్ణ వేసే ప్లాన్స్, ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ అటు హత్య కేసు ఛేదించడం, ఇటు త్రివర్ణ ఎవరో తెలియడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాకు సత్యదే వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణ.

Also read: బబుల్‌గమ్ మూవీ రివ్యూ.. సుమ తనయుడు రోషన్ కనకాల ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు..
సినిమాలో ముఖ్యంగా యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవాలి. స్వతంత్రం ముందు ఉండే ఆయుధాలు, లొకేషన్స్ లో కళ్యాణ్ రామ్ తో యాక్షన్ సీన్స్ అదరగొట్టారు. ప్రతి యాక్షన్ సీన్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడే సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో దేశభక్తి కనపడేలా అద్భుతంగా ఇచ్చారు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా స్వతంత్రం ముందు ఉండే లొకేషన్స్, ఇళ్లు.. అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది. కథనం పరంగా ఫస్ట్ హాఫ్ లో కొంచెం సాగదీసినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ ఆసక్తిగా ఉండటంతో అది కవర్ అవుతుంది.

నటీనటుల విషయానికొస్తే..
డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. సంయుక్త మీనన్ పాత్రకు, మాళవిక నాయర్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరూ నటనతో మెప్పించారు. డెవిల్ పక్కన అసిస్టెంట్ గా సత్య, వసిష్ఠ సింహ, షఫీ, మహేష్ లతో పాటు పలువురు బ్రిటిష్ యాక్టర్స్ తమ పాత్రల్లో మెప్పించారు.

మొత్తంగా ‘డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమా స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్, అతని ముఖ్య అనుచరులని పట్టుకోవాలి అనే కథాంశంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు అభిప్రాయం మాత్రమే.