Kamal Haasan : ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఒకానొక సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు తెలిపారు.

Kamal Haasan
Kamal Haasan reveals his struggle : లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఒకానొక సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు తెలిపారు. కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడం, తగిన గుర్తింపు లభించకపోవడంతో ఇలాంటి ఆలోచనలు వచ్చేవని, తన గురువు ఇచ్చిన సలహాతో ఆ ఆలోచన నుంచి బయట పడినట్లు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో శనివారం జరిగిన ఓ ఈవెంట్‌లో కమల్ హాసల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు 20 లేదా 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచించినట్లు చెప్పారు. మంచి అవకాశాలు రావడం లేదని, తగినంత గుర్తింపు లభించట్లేదని ఫీలయ్యేవాడిననన్నారు. తాను చనిపోతే ఓ మంచి కళాకారుడిని పరిశ్రమ కోల్పోయి పశ్చాత్తాపడుతుందని తాను భావించానని, తన గురువు అనంతుకు ఇదే విషయాన్ని చెప్పగా ఆయన చెప్పిన మాటలు తనకింకా గుర్తుకు ఉన్నాయన్నారు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లాలని, సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు దానంతటదే వస్తుందని ఆయన చెప్పినట్లు కమల్ హాసన్ తెలిపారు.
తనకు అదే కరెక్ట్ అనిపించిందని, ఆత్మహత్య చేసుకోవడం సబబు కాదనిపించిందన్నారు. హత్య చేయడం ఎంత నేరమో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరం, పాపమన్నారు. జీవితంలో చీకటి అనేది శాశ్వతంగా ఉండిపోదని, ఖచ్చితంగా వెలుగు వస్తుందన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండాలని సూచించారు. చావు అనేది జీవితంలో ఓ భాగమని, దాని కోసం మనం ఎదురుచూడకూడదన్నారు. ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. లక్ష్యాన్ని చేరే మార్గాన్ని అన్వేషించాలని విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు.
ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కల్కి 2898 ADలో విలన్ గా నటిస్తున్నారు.