సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్న టైమ్‌లో టైటిల్ వదిలి అభిమానులను హ్యాపీ చేశాడు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ అని పేరు ప్రకటించాక ఇప్పుడు లేటెస్ట్‌గా సినిమాలో నుంచి ఓ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది.
ఇవాళ(8 మార్చి 2020) ఉమెన్స్ డే సందర్భంగా ఇందులో మగువ మగువ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. లేటెస్ట్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ ఈ పాట పాడగా.. థమన్ సంగీతం అందించాడు. మగువ మగువ.. ఈ లోకానికి తెలుసా నీ విలువా అంటూ సాగే ఈ పాట కచ్చితంగా వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. మగువ మగువ అంటూ సాగే ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉంది.
మే 15న వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్ర చేస్తున్నాడు. తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన పింక్ సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.