మహానటి సెంటిమెంట్: మహర్షి విడుదల వాయిదా

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 11:21 AM IST
మహానటి సెంటిమెంట్: మహర్షి విడుదల వాయిదా

Updated On : March 6, 2019 / 11:21 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న సినిమా మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతుండగా.. ఏప్రిల్ 25న విడుదల చేస్తామంటూ ఇప్పటికే అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని మారుస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు.
దిల్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహర్షి చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు దిల్ రాజు తెలిపారు. చిత్రాన్ని వాయిదా వేయడానికి గల కారణాలని వివరించారు. మార్చి 17కి మహర్షి చిత్ర టాకీ పార్ట్ పూర్తవుతుందని, ఆ తర్వాత సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంటాయని చెప్పారు. మహర్షి చిత్రంలోని కొన్ని పాటలను అబుదాబిలో చిత్రీకరించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఏప్రిల్‌లో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని, ముందుగా అనుకున్న ఏప్రిల్ 25లోపు షూటింగ్ పూర్తవుతుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సమయం సరిపోదనే కారణంతో సినిమా విడుదలను ఆలస్యం చేసినట్లు తెలిపారు. 

 

ఇంత భారీ చిత్రానికి హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్ కాదని, మహేష్ బాబుతో నేను, అశ్వినీదత్ కూర్చుని చర్చించగా మే 9న మహర్షి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు దిల్ రాజు తెలిపారు. అయితే ఇందులో మరో సెంటిమెంట్ కూడా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. అశ్వినిదత్‌కు మే 9వ తేదీ బాగా కలసొచ్చింది. జగదేకవీరుడు అతిలోక సుందరి, గతేడాది వచ్చిన మహానటి చిత్రాలకు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించగా ఘనవిజయం సాధించాయి.అలాగే దిల్ రాజు కూడా  భద్ర, పరుగు, ఆర్య లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇదే నెలలో విడుదల చేయగా.. మంచి విజయం సాధించడం సెంటిమెంట్‌గా చెబుతున్నారు.