Vrusshabha Review : ‘వృషభ’ మూవీ రివ్యూ.. పునర్జన్మల నేపథ్యంతో..
ఈ సినిమాలో సమర్జిత్ పాత్రకు మొదట శ్రీకాంత్ తనయుడు రోషన్ ని ప్రకటించారు. (Vrusshabha Review)
Vrusshabha Review
Vrusshabha Review : మోహన్‌లాల్, సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా వృషభ. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్.యస్, వ్యాస్ స్టూడియోస్ నిర్మాణంలో నంద కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వృషభ సినిమా నేడు సిసెంబర్ 25 న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
కొన్ని వందల ఏళ్ళ క్రితం త్రిలింగ రాజ్యంలో ఓ ఆత్మలింగం ఉంటుంది. దాన్ని వృషభ వంశం కాపాడుతూ వస్తుంది. ఆ లింగాన్ని సాధించాలని ఎంతోమంది దాడులు చేసినా ఓడిపోతారు. అలా జరిగిన ఓ దాడిలో శత్రువు పైకి వృషభ వంశ రాజు రాజా విజియేంద్ర(మోహన్ లాల్) బాణాలు వేయగా ఓ బాణం అనుకోకుండా ఓ చంటిపిల్లాడ్ని చంపుతుంది. దాంతో ఆ పిల్లాడి తల్లి నీకు కూడా పుత్రశోకం తప్పదు, నీ బిడ్డ చేతిలోనే నీ ప్రాణాలు కూడా పోతాయి అనే శాపం ఇస్తుంది. అప్పుడే రాజా విజయేంద్ర భార్య మగబిడ్డకు జన్మనిస్తుంది. అనుకోకుండా ఆ బిడ్డ నీళ్ళల్లో పడి కనపడకుండా పోతాడు.
ప్రస్తుతం 2025 లో ఆది దేవ్ వర్మ(మోహన్ లాల్) ఓ పెద్ద వ్యాపారవేత్త. తన కొడుకు తేజ్(సమర్జిత్ లంకేష్)తో కలిసి ఉంటాడు. ఆదిదేవ్ కు అప్పుడప్పుడు కలలో గుర్రాలు, రాతలు, రాజ్యాలు వస్తుంటాయి. ఆదిదేవ్ మొదటి ప్రేమ కథని తెలుసుకొని తండ్రిని తన ప్రియురాలితో కలపాలని తేజ్ తన లవర్ దామిని(నయన్ సారిక)తో కలిసి దేవనగరికి వెళ్తాడు. అక్కడ తేజ్ పై అటాక్ జరగ్గా తండ్రి వచ్చి కాపాడితే తేజ్ తండ్రినే పొడుస్తాడు. అసలు తేజ్ తన తండ్రినే ఎందుకు చంపాలని చూస్తాడు? ఆ తల్లి ఇచ్చిన శాపం ఎలా అమలయింది? ఆత్మలింగం ఏమైంది? వృషభ వంశం కథేంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Champion Review : ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ.. రజాకార్లపై పోరాడిన భైరాన్ పల్లి కథ.. కొత్త నేపథ్యంలో..
సినిమా విశ్లేషణ..
రాజులు, రాజ్యాలు, పునర్జన్మలు అనే కథతో వస్తుడటంతో ఈ సినిమాపై కాస్త అంచనానాలు నెలకొన్నాయి. కన్నడ నటీనటులు, బాలీవుడ్ నిర్మాతలు కలిసి మలయాళం, తెలుగులో ఈ సినిమా చేయడం గమనార్హం. ఓపెనింగ్ శివుడు, ఆత్మలింగం, వృషభ వంశం అని గొప్పగా కథ మొదలుపెట్టి సస్పెన్స్ కోసం ఆ కథని మధ్యలోనే వదిలేసి ప్రస్తుతానికి వస్తారు. ఇక ఆది దేవ్, అతని కొడుకు అనుబంధం, బిజినెస్, తేజ్, దామినిల ప్రేమ ఇవన్నీ బాగా సాగదీతలా అనిపించడమే కాకుండా క్లారిటీ లేకుండా సీన్స్ ఉంటాయి.
కొడుకు ప్రేమకథ ఫెయిల్ అయిందని చెప్తే తండ్రి మొదటి ప్రేమ కథ తెలుసుకొని వాళ్ళని ఎందుకు కలపాలనుకుంటాడో అర్ధం కాదు. ఇంటర్వెల్ కి మాత్రం కొడుకే తండ్రిని పొడవటంతో ఎందుకు అనే ఆసక్తి సెకండ్ హాఫ్ పై నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ వృషభ వంశం, త్రిలింగ దేశానికి తీసుకెళ్తారు. ఆ సీన్స్ కొన్ని బాగానే ఉంటాయి. కానీ అక్కడ చూపించే ట్విస్ట్ ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే ఊహించొచ్చు. కొడుకు చేతి నుంచి తండ్రి ఎలా తప్పించుకుంటాడు అనేది రొటీన్ దేవుడికి లింక్ పెట్టి నడిపించారు.
ప్రస్తుతంలో ఓ బ్యాచ్ తండ్రికొడుకులని చంపాలని చూస్తుంది వాళ్లెవరో, వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటో చెప్పలేదు. ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన ఆత్మలింగం తర్వాత ఏమయిందో క్లారిటీ ఇవ్వలేదు. అసలు తల్లి ముఖం ఎలా ఉంటుందో తెలియని కొడుకు ప్రస్తుతం తల్లి మొహం చూసి గత జన్మ గుర్తుకు రావడమేంటో దర్శకుడికే తెలియాలి. ఇటీవల చాలా సినిమాల్లోలాగే ఇందులో కూడా AI ని విజువల్స్ కోసం బాగానే వాడారు. తండ్రి కొడుకులు, ఓ శాపం, పునర్జన్మ నేపథ్యంలో కథని సాగదీస్తూ అక్కర్లేని ప్రేమకథని, పాటని ఇరికించి చూపించారు. ఈ సినిమాలో సమర్జిత్ పాత్రకు మొదట శ్రీకాంత్ తనయుడు రోషన్ ని ప్రకటించారు. కానీ ఏం జరిగిందో రోషన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. సినిమా చూసాక తప్పుకోవడమే మంచిది అనిపిస్తుంది ప్రేక్షకులకు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
మోహన్ లాల్ నటన గురించి చెప్పాల్సిన పన్లేదు. ఎప్పట్లాగే ఆయన రెండు పాత్రల్లో తన బెస్ట్ ఇచ్చాడు. సమర్జిత్ లంకేష్ కూడా రెండు పాత్రలో బాగానే నటించాడు. రాగిణి ద్వివేది కూడా తన నటనతో మెప్పిస్తుంది. నయన్ సారిక పాత్ర ఓ పాట రెండు సీన్స్ కోసం మాత్రమే. అజయ్, అయ్యప్ప శర్మ, భద్రం.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు మాత్రం యావరేజ్. ఎడిటింగ్ లో ఓ పాట కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్. రాజుల కాలం నాటి సీన్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. రొటీన్ పునర్జన్మ రివెంజ్ కథను తండ్రీకొడుకుల నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘వృషభ’ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన తండ్రీకొడుకుల కథ. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
