Hit 3 : ‘హిట్ 3’ మూవీ రివ్యూ.. నాని రక్తపాతం.. ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి..
నానినే హీరోగా హిట్ 3 వస్తుండటం, ట్రైలర్ లో నాని బాగా వైలెంట్ గా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Nani Srinidhi Shetty Hit 3 Movie Review and Rating
Hit 3 Movie Review : నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన సినిమా హిట్ 3. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హిట్ సిరీస్ లో భాగంగా మూడో సినిమాగా వచ్చిన హిట్ 3 సినిమా నేడు మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజయింది. కోమలీ ప్రసాద్, రావు రమేష్, చైతు జొన్నలగడ్డ, సముద్రఖని, ప్రతీక్ బబ్బర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే.. అర్జున్ సర్కార్(నాని)ని జైలుకు పంపించడంతో కథ మొదలవుతుంది. అక్కడ ఓ ఖైదీకి అర్జున్ తన కథని చెప్తాడు. అర్జున్ జమ్మూకాశ్మీర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం(HIT)లో పనిచేస్తుంటాడు అక్కడ ఒక మర్డర్ జరగడంతో అది చేసిన క్రిమినల్ ని కనిపెడతాడు అర్జున్. కానీ అదే రోజు అలాంటి మర్డర్ బీహార్ లో కూడా జరగడంతో అర్జున్ బీహార్ కి వెళ్లి ఆ క్రిమినల్ కూడా శ్రీనగర్ కి తెస్తాడు. ఇలాంటి టైప్ మర్డర్స్ ఇంకా చాలా జరిగాయని తెలుస్తుంది. అయితే అర్జున్ ని అక్కడ్నుంచి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు.
వైజాగ్ లో మ్యాట్రిమోని సైట్ ద్వారా అర్జున్ కి మృదుల పరిచమయి ప్రేమలో పడతారు. మరోవైపు అలాంటి మర్డర్ జైపూర్ లో జరగబోతుందని కనిపెట్టి అక్కడికి ఆపడానికి వెళ్తాడు అర్జున్. అయితే ఆ క్రిమినల్స్ ఎలా అయితే మర్డర్ చేశారో అర్జున్ కూడా వైజాగ్ లో అలాగే మర్డర్స్ చేస్తాడు. ఒకే రకంగా వివిధ ప్రదేశాల్లో ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అర్జున్ సర్కార్ ఎందుకు అదే ఫార్మేట్ లో మర్డర్స్ చేసాడు? జైపూర్ లో జరిగే మర్డర్ ని ఆపుతారా? అర్జున్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? అర్జున్ ని వైజాగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసారు? అర్జున్ – మృదుల ప్రేమకథ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Retro : సూర్య ‘రెట్రో’ మూవీ రివ్యూ.. 90s బ్యాక్ డ్రాప్ తో..
సినిమా విశ్లేషణ.. నాని నిర్మాణంలో వచ్చిన హిట్ 1,2 సినిమాలు క్రిమినల్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ తో సస్పెన్స్ తో సాగి మంచి విజయాలు సాధించడంతో ఈసారి నానినే హీరోగా హిట్ 3 వస్తుండటం, ట్రైలర్ లో నాని బాగా వైలెంట్ గా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు బుకింగ్స్ కూడా భారీ ఓపెనింగ్స్ ఇచ్చాయి. ఈ సినిమాలో కూడా మర్డర్స్ జరగడం, ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అని అర్జున్ కనిపెట్టే ఇన్వెస్టిగేటివ్ పార్ట్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ లో మృదుల, వర్ష కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
చివరి అరగంట మాత్రం వైలెన్స్ ఓ రేంజ్ లో ఊహించని విధంగా ఉంటుంది. మర్డర్ సీన్స్, కొన్ని విజువల్స్ చాలా డిస్టర్బ్ గా ఉంటాయి. ఈ సినిమాకు పిల్లల్ని అస్సలు తీసుకెళ్లకూడదు. ఫ్యామిలీతో కూడా వెళ్ళకపోవడం మంచిది. అక్కడక్కడా ఇంత వైలెన్స్ అవసరమా అనిపిస్తుంది కానీ అలాంటి క్రిమినల్స్ కి ఇదే కరెక్ట్ అనేలా జస్టిఫై చేసారు. క్లైమాక్స్ కు ముందు మాత్రం కాస్త సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. క్రిమినల్స్ కాన్సెప్ట్ కొత్తగా రాసుకున్నా వాళ్ళు దేని కోసం అలా చేస్తున్నారో సరైన క్లారిటీ ఇవ్వలేదు.
ఇటీవల వైలెన్స్, రక్తపాతం అంటూ కొన్ని సినిమాలు అవే ఫోకస్ గా ప్రేక్షకుల మనఃశాంతిని డిస్టర్బ్ చేసే విజువల్స్ తో వస్తున్నాయి. ఇది కూడా అలాగే అనిపిస్తుంది. నాని సీరియస్, క్రూరమైన పోలీస్ పాత్రలో చూపించినా అతను ఎందుకు అలా ఉన్నాడు అని క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. కానీ నానికి ఎలివేషన్స్ బాగా పడ్డాయి. లవ్ స్టోరీ కూడా కాస్త కొత్తగా రాసుకున్నారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ లో అడవి శేష్ ఎంట్రీ మంచి హైప్ ఇస్తుంది. ఇక ముందు నుంచి అనుకున్నట్టే హిట్ 4 ఉంటుందని, అందులో హీరో కార్తీ అని చివర్లో ఓ సీన్ చూపించారు. ఇటీవల మలయాళం మార్కో సినిమా వైలెన్స్ కి పరాకాష్ట అన్నారు. ఇప్పుడు తెలుగులో హిట్ 3 కూడా అంతే అంటారేమో. ఫ్యామిలీతో, పిల్లలతో మాత్రం వెళ్లకపోవడమే మంచిది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఫ్యామిలీ ఇమేజ్ నుంచి ఇప్పుడిప్పుడే మాస్ ఇమేజ్ కి మారుతున్న నాని ఇందులో దయాదాక్షిణ్యాలు లేని క్రూరమైన పోలీసాఫీసర్ గా వైలెన్స్, రక్తపాతం చూపించి ఎప్పట్లాగే తన బెస్ట్ ఇచ్చాడు. శ్రీనిధి క్యూట్ గా కనిపిస్తూనే ఫైట్స్ తో అదరగొట్టింది. కోమలి ప్రసాద్ కూడా పోలీస్ పాత్రలో యాక్షన్ తో బాగా మెప్పించింది. ప్రతీక్ బబ్బర్ నెగిటివ్ పాత్రలో బాగా నటించాడు. సముద్రఖని నాని తండ్రి పాత్రలో అక్కడక్కడా కనిపించి మెప్పించారు. చైతు జొన్నలగడ్డకు కూడా మంచి పాత్ర పడింది. రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, సూర్య శ్రీనివాస్, అమిత్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. అడివి శేష్, కార్తీ గెస్ట్ పాత్రల్లో హైప్ ఇచ్చారు.
Also Read : Hit 3 Twitter Review : నాని ‘హిట్ 3’ మూవీ ట్విట్టర్ రివ్యూ..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో కెమెరా వర్క్ బాగుంది. క్లాస్ మ్యూజిక్ ఇచ్చే మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. పాటలు బాగున్నాయి. లొకేషన్స్ కూడా కొత్తకొత్తవి వెతికి బాగా పట్టుకున్నారు. మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో పాటు మంచి స్క్రీన్ ప్లేతో బోల్డంత వైలెన్స్ తో శైలేష్ కొలను బాగా రాసుకున్నాడు. ఇక నాని నిర్మాణ సంస్థ అంటే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ది బెస్ట్ ఉంటాయని అందరికి తెలిసిందే. ఈ సినిమాకు కూడా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా నాని ‘హిట్ 3’ సినిమా మర్డర్స్, క్రిమినల్స్ కోసం సాగే వైలెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.