Retro : సూర్య ‘రెట్రో’ మూవీ రివ్యూ.. 90s బ్యాక్ డ్రాప్ తో..

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా అని, రెట్రో స్టైల్ లో 90ల్లో సినిమా అనడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి.

Retro : సూర్య ‘రెట్రో’ మూవీ రివ్యూ.. 90s బ్యాక్ డ్రాప్ తో..

Suriya Pooja Hegde Karthik Subbaraj Retro Movie Review and Rating

Updated On : May 1, 2025 / 4:55 PM IST

Retro Movie Review : సూర్య, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా ‘రెట్రో’. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మాణంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రెట్రో సినిమా నేడు మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజయింది. జయరాం, జోజు జార్జ్, నాజర్, ప్రకాష్ రాజ్, సుజిత్ శంకర్ పలువురు కీలక పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే.. లోకల్ రౌడీ తిలక్(జోజు జార్జ్) దగ్గర పనిచేసే సెక్యూరిటీని ఎవరో చంపేయడంతో అతని మనవడు పారివేల్ కన్నన్(సూర్య) అనాధగా మారతాడు. తిలక్ భార్య సంధ్య(శ్వాసిక)కు పిల్లలు లేకపోవడంతో ఆమె పెంచుకుంటాను అంటుంది. సంధ్య పారివేల్ ని కొడుకుగా అంగీకరించినా తిలక్ అంగీకరించడు. సంధ్య చనిపోయాక తిలక్ పారివేల్ ని వదిలించుకుందాం అనుకుంటాడు కానీ పారివేల్ అతన్ని కాపాడటంతో తన కింద పనికొస్తాడు అని పెట్టుకుంటాడు. పారివేల్ చిన్నప్పుడు పరిచయం అయిన రుక్మిణి(పూజ హెగ్డే)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. గొడవలు అన్ని వదిలేసి వస్తేనే చేసుకుంటాను అనడంతో గొడవలు వదిలేస్తాడు పారివేల్.

కానీ పెళ్ళికి ముందు ఆఫ్రికాకు వెళ్లాల్సిన ఓ గోల్డ్ ఫిష్ మెటీరియల్ వెళ్ళకపోవడం, అది పారివేల్ ఎక్కడో దాచిపెట్టడంతో తిలక్ చెప్పకపోతే రుక్మిణిని చంపేస్తానంటాడు. ఈ గొడవలో పెళ్లి రోజు పారివేల్ తిలక్ చేయి నరికి, కొంతమందిని చంపడంతో జైలుకు వెళ్తాడు. రుక్మిణి కూడా పారివేల్ మారలేదని వెళ్ళిపోతుంది. పారివేల్ చిన్నప్పటుంచి నవ్వడు. అతనికి నవ్వడం రాదు. తన పెంపుడు తల్లి, రుక్మిణి, ఇంకా చాలా మంది పారిని నవ్వించడానికి ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. మరి పారివేల్ నవ్వుతాడా? పారివేల్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు. రుక్మిణి పారివేల్ ప్రేమ ఏమైంది? అనాథగా మిగిలిన పారివేల్ ఎవరు? ఆ గోల్డ్ ఫిష్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Retro Twitter Review : రెట్రో ట్విట్టర్ రివ్యూ.. సూర్యకి హిట్టు పడిందా?

సినిమా విశ్లేషణ.. ఇటీవల సూర్య సినిమాలు అంతగా మెప్పించని నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా అని, రెట్రో స్టైల్ లో 90ల్లో సినిమా అనడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. ఓ అనాథని రౌడీ పెంచితే ఆ రౌడీకి ఎదురు తిరగడం, తన ప్రేమ కోసం హీరో గొడవలు వదులుకోవాలనుకోవడం, చివర్లో ఆ అనాధకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండటం.. ఇవన్నీ రెగ్యులర్ చాలా సినిమాలో చూస్తూనే ఉంటాము. రెట్రో కూడా అదే కథ. కాకపోతే ఈ కథ 90ల్లో నడిపించారు.

సినిమాలో అండమాన్ నికోబర్ లో ఓ ఐలాండ్, అక్కడ ఇంకా రాజుల పాలన, బానిసలు, అక్కడ ఫైట్స్ ఇవన్నీ కొత్తగా చూపించడానికి ట్రై చేసారు. లవ్ స్టోరీ లీడ్ బాగానే తీసుకున్నా ఆ తర్వాత హీరో మారకపోతే హీరోయిన్ మాటిమాటికి వదిలి వెళ్లిపోవడం రొటీన్ లవ్ స్టోరీ అయిపోయింది. సినిమా అంతా మొదట్నుంచి చివరిదాకా బాగా సాగదీశారు. సినిమా అయిపోయింది అనుకునేలోపు ఇంకా అవ్వలేదా అనే నిరాశ కలిగించేలా సాగదీశారు. బాహుబలి, జయం మనదేరా టైపు రొటీన్ క్లైమాక్స్. 90ల్లో సినిమా కథని చూపించారు కాబట్టి రెట్రో అని టైటిల్ పెట్టారేమో కానీ టైటిల్ కి, కథకి సంబంధమే లేదు. మధ్యమధ్యలో సూర్య ఫైట్స్ సెవెంత్ సెన్స్ సినిమాని గుర్తు చేస్తూ ఉంటాయి. సూర్య అసలు ఇలాంటి స్క్రిప్ట్ ఎలా ఒప్పుకున్నాడో అనే సందేహం కలగక మానదు.

Retro Movie

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎప్పట్లాగే సూర్య తన పాత్రకు బెస్ట్ ఇచ్చాడు. పూజాహెగ్డే డార్క్ మేకప్ తో కొత్తగా కనపడినా తన క్యారెక్టర్ సరిగ్గా రాసుకోకపోవడంతో అంతగా ఎఫెక్ట్ ఇవ్వదు. సినిమా అంతా తనకోసమే కథ నడిపించినా పూజ పాత్రకు స్కోప్ లేకపోవడం గమనార్హం. జాజు జార్జ్, విధు నెగిటివ్ పాత్రల్లో బాగా మెప్పించారు. నాజర్, ప్రకాష్ రాజ్ అక్కడక్కడా గెస్ట్ పాత్రల్లో కనిపించారు. సుజిత్ శంకర్ కామెడీ విలన్ గా అక్కడక్కడా నవ్వించాడు. జయరాం కూడా నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Hit 3 Twitter Review : నాని ‘హిట్ 3’ మూవీ ట్విట్టర్ రివ్యూ..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. 90’s విజువల్స్ బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. యూట్యూబ్ లో హిట్ అయిన కణిమా సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ యావరేజ్. 90’s కి తగ్గట్టు డ్రెస్ ల కోసం కాస్ట్యూమ్ డిజైనర్స్ మాత్రం బాగా కష్టపడ్డారు. లొకేషన్స్ కూడా కొత్త కొత్త లొకేషన్స్ వెతికి పట్టుకున్నారు. రొటీన్ కథని రొటీన్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రాయడం నమ్మశక్యం కానీ విషయం. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘రెట్రో’ సినిమా రెగ్యులర్ కథ, కథాంశంతో బాగా సాగదీసిన 90s బ్యాక్ డ్రాప్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.