అంబులెన్స్ ఆలస్యం : బిడ్డను ప్రసవించి చనిపోయిన సినీనటి

ప్రమాదంలో ఉన్నవారిని కాపాడే అంబులెన్స్ సమయానికి రాకపోవటంతో ఓ నటి మృతి చెందారు. ఈ విషాదం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మరాఠి నటి పూజా జుంజార్ అనే 25 సంవత్సరాల నటి హాస్పిటల్ కు వెళ్లేందుకు అంబులెన్స్ టైమ్ కు రాకపోవటంతో మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే..ముంబై నగరానికి 590 కిలోమీటర్ల దూరంలోని మరాట్వాడలోని హింగోలి జిల్లాకు చెందిన పూజా జుంజార్(25) మరాఠీ సినిమా నటి. గర్భం దాల్చిన పూజా జుంజార్ పురిటినొప్పులతో బాధపడుతున్న సమయంలో ప్రసవం కోసం సోమవారం (21.10.209) తెల్లవారుజామున రెండు గంటలకు గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ పూజా బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత కొద్ది సమయానికి శిశువు మరణించింది. పూజా పరిస్థితి కూడా విషమంగా తయారైంది. దీంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హింగోలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాథమిక వైద్యకేంద్రం డాక్టర్లు సూచించారు.
గోరేగాం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హింగోలికి తరలించేందుకు పూజా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు.కానీ సరైన సమయానికి అంబులెన్స్ సేవలు లభించలేదు. ఈ క్రమంలో పూజా పరిస్థితి మరింతగా విషమించింది. దీంతో వెంటనే పూజా బంధువులు నానా కష్టాలు పడి ఓ ప్రైవేటు అంబులెన్స్ తీసుకువచ్చారు. వెంటనే ఆమెను హింగోలికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే పూజా మరణించారు.
అంబులెన్స్ సకాలంలో లభించనందు వల్లే వైద్యం అందక మరాఠీ సినీనటి పూజా జుంజార్ మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పూజా రెండు మరాఠీ చిత్రాల్లో నటించిన పూజా గర్భం దాల్చడంతో బ్రేక్ తీసుకున్నారు. ప్రసవంలో పూజాతోపాటు శిశువు కూడా మరణించడం మరాఠీ చిత్ర సీమలో విషాదాన్ని నింపింది.