నష్టం బీఎంసీ ఇవ్వాలి, కంగనా ఇల్లు కూల్చివేతపై హైకోర్టు విచారణ

Kangana’s house demolition : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబైలోని కంగనా ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కూల్చివేత నష్టాన్ని బీఎంసీ నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. కూల్చివేత నోటీసులను రద్దు చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా కంగనా తన భవనం నిర్మాణంలో మార్పులు చేశారని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు కంగనాకు సెప్టెంబరులో నోటీసులిచ్చారు.
అనంతరం ఆమె భవనంలో కొంత భాగాన్ని కూల్చివేశారు. దీనికి వ్యతిరేకంగా కంగనా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పరిశీలించిన బాంబే హైకోర్టు భవనం కూల్చివేతపై స్టే విధించింది. తాజాగా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు నోటీసులను రద్దు చేసింది. కంగనాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఒకరిని నియమించాలని, వాళ్లు సూచించిన మేరకు నష్టపరిహారం చెల్లించాలని, దీనిపై హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
https://10tv.in/himachal-pradesh-five-brothers-one-wife-in-village-tradition/
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో బాలీవుడ్‌కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు కంగనా. సుశాంత్ మృతిలో డ్రగ్స్ మాఫియా హస్తముందని కంగనా వ్యాఖ్యానించిన తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఈ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనాకు మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ క్రమంలోనే కంగనా భవనాన్ని బీఎంపీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదమయింది.