ఇండియా లెవెల్లో తెలుగు మూవీ తడబాటుకు కారణమేంటి?

పాన్‌ ఇండియా లెవల్‌లో చిత్రీకరిస్తున్న కొన్ని సినిమాలు కేవలం తెలుగులో తప్ప మరే పరిశ్రమలోనూ..

ఇండియా లెవెల్లో తెలుగు మూవీ తడబాటుకు కారణమేంటి?

పాన్‌ ఇండియా మూవీ… టాలీవుడ్‌ డైరెక్టర్లు, హీరోల్లో ఎక్కువ మంది ఆలపిస్తున్న రాగమిదే.. స్టోరీ ఏదైనా సరే అన్ని భాషల్లో రిలీజ్‌కు రెడీ అయిపోతున్నారు. కొన్ని సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌ను అందుకుని విజయవంతం అవుతున్నాయి కూడా.. దీంతో ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ ఎక్కువైంది… మరి పాన్‌ ఇండియా మూవీ వర్క్‌ అవుట్‌ అవుతుందా? టాలీవుడ్‌ నుంచి రూపుదిద్దుకుంటున్న పాన్‌ ఇండియా మూవీస్‌ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

పాన్‌ ఇండియా మూవీస్‌గా చిత్రీకరిస్తున్న టాలీవుడ్‌ చిత్రాలు ఇతర భాషల్లో తడబుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. బాహుబలి, ట్రిపుల్‌ ఆర్‌ వంటి చిత్రాలు విజయవంతమైనా తాజాగా రిలీజ్‌ అయిన కొన్ని పాన్‌ ఇండియా మూవీస్‌కు కనీసం పోస్టర్‌ ఖర్చులు కూడా తెచ్చుకోలేకపోయాయంటున్నారు. ఇటీవల కాలంలో తెలుగులో ప్రతి సినిమాను పాన్‌ ఇండియాగా చిత్రీకరిస్తుండటం వల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్‌ నమోదు చేస్తున్నాయని టాక్‌ వినిపిస్తోంది.

పాన్‌ ఇండియా చిత్రాల ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించొచ్చని టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆశిస్తే.. వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని చెబుతున్నారు. చిత్ర నిర్మాణం తర్వాత టాలీవుడ్‌ కన్నా ఇతర భాషల్లో ఎక్కువగా ప్రచారం చేయడం, ప్రమోషన్స్‌కు హీరోలే స్వయంగా వెళుతున్నా పెద్దగా వర్క్‌అవుట్‌ అవ్వడం లేదని చెబుతున్నారు. దీనికి ఇటీవల రిలీజ్‌ అయిన రెండు చిత్రాలను ఉదహరిస్తున్నారు.

పాన్‌ ఇండియా లెవల్‌లో చిత్రీకరిస్తున్న కొన్ని సినిమాలు కేవలం తెలుగులో తప్ప మరే పరిశ్రమలోనూ రిలీజ్ చేసుకోకపోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సినిమాలు రిలీజ్ చేసినా కనీసం పోస్టర్ ఖర్చులు కూడ రావటం లేదని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమానే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ బాగా వసూళ్లు చేసిందని పార్ట్-2పై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు నిర్మాతలు. కానీ హిందీ బెల్ట్‌లో ఈ సినిమాను అసలు పట్టించుకోలేదని చెబుతున్నారు.

అదేవిధంగా ఇటీవల రిలీజైన సరిపోదా శనివారం కూడా బాలీవుడ్‌లో రిలీజ్‌ చేసుకోలేకపోయారు. ఈ సినిమా కోసం హీరో నాని ముంబైలో విపరీతంగా ప్రచారం చేశాడు. ఆఖరికి సినిమా రిలీజ్ కూడా చేసుకోలేక వదిలేశారని అంటున్నారు. అదేవిధంగా తమిళ్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ తెలుగులో ఆగస్ట్ 15న రిలీజైతే హిందీలో ఆగస్ట్ 30న విడుదలైంది. ఇక సూపర్‌ హిట్‌గా చెబుతున్న కల్కికి కూడా కొన్ని కష్టాలు ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అబితాబ్‌ ఉండటం వల్లే హిందీ బెల్ట్‌లో ఆ సినిమా ఆడిందనే టాక్‌ ఉంది. ఇలా టాలీవుడ్‌ నుంచి విడుదలవుతున్న పాన్‌ ఇండియా మూవీస్‌ ఎక్కువగా తడబడుతున్నాయనే ప్రచారమే ఉంది.

తనకు ప్రమాదం జరిగిందంటూ.. అభిమానులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ రష్మిక