Mr. Work From Home : ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మూవీ రివ్యూ.. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలుసా..?
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేడు మే 15న థియేటర్స్ లో రిలీజ్ అయింది. (Mr. Work From Home)
Mr. Work From Home
Mr. Work From Home Review : త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మాణంలో మధుదీప్ చెలికాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేడు మే 15న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
అరవింద్(త్రిగుణ్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. అమెరికాలో జాబ్ వదిలేసొచ్చి మిల్లెట్స్ వ్యవసాయం చేస్తానంటూ తిరుగుతాడు. మహి(పాయల్ రాధాకృష్ణ) డబ్బున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకునే ఓ అమ్మాయి. అరవింద్ తొలిచూపులోనే మహిని ఇష్టపడి తనెవరో కనుక్కునే ప్రయత్నాలు చేసి ఆమెకు దగ్గరవుతాడు. అరవింద్ నిజాలు చెప్పినా అరవింద్ తల్లి, అరవింద్ తో ఉండేవాళ్ళు అతను బాగా డబ్బున్నవాడు అన్నట్టు చెప్పడంతో మహి అరవింద్ ని ఇష్టపడుతుంది. అరవింద్ డబ్బులు సంప్రదించకుండా ఇంట్లో తిని తిరుగుతుండటంతో ఇంట్లోంచి గెంటేస్తాడు అతని తండ్రి(అవినాష్ కురువిళ్ళ).
మరి అరవింద్ మిల్లెట్స్ వ్యవసాయం చేస్తాడా? మిలెట్స్ గురించి ప్రచారం చేసే బలరాం చక్రవర్తి(శివాజీరాజా) అరవింద్ కలిసి ఏంచేస్తారు? అరవింద్ దగ్గర డబ్బులు లేవని తెలిసి మహి ఏం చేస్తుంది? అరవింద్ ని మళ్ళీ తండ్రి దగ్గరకు తీసుకుంటాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Veerabhadrudu Review : సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ.. దేవుడే దిగి లాయర్ గా వస్తే..
సినిమా విశ్లేషణ..
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే టైటిల్ తో ఇదేదో కరోనా సమయంలో కథ లేకపోతే సాఫ్ట్ వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కథ అనుకుంటారు. కానీ ఇది వ్యవసాయం, ఓ ప్రేమకథ చుట్టూ తిరిగే కథ. వ్యవసాయం వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈ సినిమాలో చెప్పుకొచ్చారు.
ఫస్ట్ హాఫ్ అరవింద్ పాత్ర పరిచయం, అతని వ్యవసాయం కల, మహితో ప్రేమకథ, మధ్యమధ్యలో స్పీచ్ లు ఇచ్చే బలరాం చక్రవర్తి కథతో ముందుకు వెనక్కి సాగుతూ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. హీరో ఫ్రెండ్స్ పాత్రలతో కామెడీ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ప్రేమ కథ కూడా రొటీన్. ఇక విరామ సమయానికి ప్రేమికుల మధ్య కలహాలతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించారు.
సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ని మించి సాగదీశారు. ఓ పక్క ప్రేమకథ సాగదీస్తూ చాలా సినిమాల్లో లాగే హీరో టెక్నాలజీని వాడుకొని ఎదిగేయడం, మిల్లెట్స్ పండించడం లాంటివి సిల్లీగా చూపిస్తారు. అసలు వ్యవసాయం అంటే చాలా ఈజీ అని చూపిస్తారు ఇందులో. బలరాం చక్రవర్తి అని శివాజీ పాత్ర పెట్టారు కానీ ఎందుకు పెట్టారు, అతను అరవింద్ కి ఏం హెల్ప్ చేసాడో కరెక్టుగా చెప్పలేదు. మధ్యమధ్యలో నాలుగు సీన్స్ ఆయనవి పెట్టాలి అన్నట్టు పెట్టారు.
ఇక ప్రేమ కథ సీన్స్ కూడా అంతే సినిమాలో చూపించిన స్క్రీన్ ప్లేతో ఎప్పుడు ఏ సీన్ వస్తుందో , ఆ సీన్ ఎప్పుడు జరిగిందో అని మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని కథని అర్ధం చేసుకోవాలి. అసలు హీరోయిన్ డబ్బుల కోసమే హీరోని పెళ్లి చేసుకుంటున్నాను లేకపోతే వద్దు అని క్లియర్ గా తన క్యారెక్టర్ గురించి చెప్పినా అయితే వద్దని హీరో క్లియర్ గానే ఉన్నా హీరో తండ్రి వీళ్ళ పెళ్లి చేయాలని ఎందుకు ఉబలాట పడతాడో అర్ధం కాదు. క్లైమాక్స్ లో ఎమోషన్స్ వర్కౌట్ చేద్దామనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అసలు విలన్స్ లేని సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో అక్కర్లేని ఓ ఫైట్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హర్షవర్ధన్ దేవుడి పాత్ర ఎందుకు వచ్చిందో అర్ధం కాదు. మొత్తంగా మిల్లెట్స్ వ్యవసాయం చేద్దాం అనే మంచి పాయింట్ ని సాగదీసిన లవ్ స్టోరీతో జతచేసి కామెడీగా తెరకెక్కించే ప్రయత్నం చేసారు. ఓపిక ఉంటే చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ బాగానే నటించారు. గుండు సుదర్శన్, సుదర్శన్, వైవా హర్ష.. అక్కడక్కడా నవ్వించే ప్రయాతం చేసారు. సత్యకృష్ణ, అవినాష్ కురువిళ్ళ, శివాజీ రాజా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Dhurandhar 2 OTT Date : జియో హాట్ స్టార్లో ధురంధర్ 2 స్ట్రీమింగ్.. ఏ రోజు నుంచంటే?
సాంకేతిక అంశాలు..
సినిమాటిక్ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. పాటలు మెప్పించవు. రీ రికార్డింగ్ అసలు సెట్ అవ్వలేదు. కొన్ని డైలాగ్స్ అయితే వరస్ట్. ఓ లవ్ స్టోరీ, కామెడీ కథలో మంచి మెసేజ్ ని ఇరికించాలని తడబడ్డాడు డైరెక్టర్. సినిమా అంతా ఆల్మోస్ట్ రెండు, మూడు లొకేషన్స్ లోనే తీసేసారు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ గందరగోళంగా సాగే వ్యవసాయం మెసేజ్ తో కూడిన ప్రేమకథ. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
