MR. & MRS. MAHI : ‘మిస్టర్ & మిసెస్ మహీ’ మూవీ రివ్యూ.. క్రికెటర్‌గా జాన్వీ కపూర్..

ప్రతి సినిమాకు కొత్తకొత్తగా ట్రై చేస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించింది.

MR. & MRS. MAHI : ‘మిస్టర్ & మిసెస్ మహీ’ మూవీ రివ్యూ.. క్రికెటర్‌గా జాన్వీ కపూర్..

Raj Kummar Rao Janhvi Kapoor MR. & MRS. MAHI Movie Review and Rating

Updated On : June 1, 2024 / 9:50 AM IST

MR. & MRS. MAHI Movie Review : రాజ్ కుమార్ రావ్(Raj Kummar Rao), జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా శరన్ శర్మ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ & మిసెస్ మహీ’. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ బాలీవుడ్ సినిమా నిన్న మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం హిందీ భాషలోనే ఈ సినిమా దేశమంతా రిలీజయింది. ప్రతి సినిమాకు కొత్తకొత్తగా ట్రై చేస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించింది.

కథ విషయానికొస్తే.. మహేంద్ర(రాజ్ కుమార్ రావ్) చిన్నప్పట్నుంచి క్రికెటర్ అవ్వాలని, ఇండియాకు ఆడాలని కలలు కని ప్రాక్టీస్ చేసి క్లబ్స్ లెవల్లో ఆడతాడు. కానీ స్టేట్ లెవల్ కి కూడా సెలెక్ట్ అవ్వకపోవడంతో అతన్ని ఫెయిల్యూర్ గా చూస్తున్న వాళ్ళ నాన్న ఇకపై వచ్చి తమ షాప్ చూసుకోమని చెప్తాడు. ఓ ఫెయిల్యూర్ పర్సన్ గా మిగిలిపోయి మహేంద్ర తమ స్పోర్ట్స్ షాప్ లో పనిచేస్తాడు. కొన్నాళ్ల తర్వాత మహిమ(జాన్వీ కపూర్)తో పెళ్లి చూపులు జరిగి పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దర్నీ అందరూ మహీ అనే నిక్ నేమ్ తోనే పిలుస్తూ ఉంటారు.

పెళ్లి అయ్యాక మహిమకు కూడా క్రికెట్ ఇష్టమని తెలుస్తుంది. ఎప్పుడో కోల్పోయిన సంతోషం మహిమ వల్ల మహేంద్ర లైఫ్ లోకి రావడంతో మళ్ళీ క్రికెటర్ అవ్వాలనుకుంటాడు కానీ తన ఏజ్, ఫిట్నెస్ సరిపోదని తెలిసి కనీసం కోచ్ అవ్వాలనుకుంటాడు. ఆ ఛాన్స్ కూడా మిస్ అయిందని బాధపడుతున్న సమయంలో మహిమ క్రికెట్ బాగా ఆడటం చూస్తాడు. దీంతో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న మహిమని తనలో ఉన్న క్రికెట్ ట్యాలెంట్ ని బయటకు తీయమని చెప్పి తాను కోచింగ్ ఇస్తాను క్రికెటర్ అవ్వు అని అడుగుతాడు. మరి మహిమ క్రికెటర్ అయిందా? అసలు ఎలాంటి అనుభవం లేని మహిమ స్టేట్, నేషనల్స్ కి సెలెక్ట్ అయిందా? కోచ్ గా మహేంద్ర సక్సెస్ అయ్యాడా? ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి? మహేంద్ర వాళ్ళ నాన్న దగ్గర గెలిచాడా? మహేంద్ర తమ్ముడు ఎవరు? అతన్ని చూసి మహేంద్ర ఎందుకు బాధపడతాడు అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..

సినిమా విశ్లేషణ.. సాధారణంగా లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి గెలవడం అనే కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ కోవలోనిదే కానీ తన భార్య గెలిస్తే తాను గెలిచినట్లే అని భావించే వ్యక్తి కథ. ఫస్ట్ హాఫ్ అంతా మహేంద్ర ఫెయిల్యూర్స్, మహిమతో పెళ్లి, హ్యాపీ లైఫ్, మహిమని క్రికెటర్ గా మార్చాలనుకోవడం చూపిస్తాడు. ఫస్ట్ హాఫ్ కొంత నిదానంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో మహిమ క్రికెటర్ అవ్వడానికి ప్రయత్నించడం, ఈ క్రమంలో భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న విబేధాలు చూపించి మంచి ఎమోషన్ తో కట్టి పడేస్తారు. సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్ సీన్స్ చాలానే ఉన్నాయి. అయితే ముందు నుంచి తండ్రి – కొడుకుల రిలేషన్ ఒకటి చూపించి క్లైమాక్స్ లో దానికి ఎండింగ్ ఇచ్చినా సరైన ముగింపు ఇవ్వలేదు అనిపిస్తుంది. ఇక అన్ని స్పోర్ట్స్ సినిమాల్లో ఉండే క్లైమాక్సే ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇది ఓ రకంగా స్పోర్ట్స్ సినిమా అయినా స్పోర్ట్స్ కంటే కూడా ఎమోషన్ మీదే కథని తీసుకెళ్లారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రాజ్ కుమార్ రావ్ మహేంద్రగా భార్యని క్రికెటర్ చేయనుకునే కోచ్, ఫెయిల్యూర్ వ్యక్తిగా మంచి ఎమోషన్ ని పండించాడు. జాన్వీ కపూర్ కూడా ఫస్ హాఫ్ లో క్యూట్ గా కనిపించి సెకండ్ హాఫ్ లో క్రికెటర్ గా కనపడి అలరించింది. జాన్వీ కూడా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. కుముద్ మిశ్రా రాజ్ కుమార్ రావ్ తండ్రి పాత్రలో కనిపించి అందరి ఇళ్లల్లో ఉండే ఫాదర్ గా అదరగొట్టేసాడు. జారినా వాహబ్ రాజ్ కుమార్ తల్లి పాత్రలో కనిపించి ఓ సీన్ లో మాత్రం మెప్పిస్తుంది. రాజేష్ శర్మ రాజ్ కుమార్ కోచ్ పాత్రలో ఓకే అనిపించాడు. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

సాంకేతిక అంశాలు.. స్పోర్ట్స్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. క్రికెట్ సీన్స్ అన్ని బాగా చూపిస్తారు. పాటలు ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎమోషన్స్ సీన్స్ లో బాగుంటుంది. స్పోర్ట్స్ కథల్లో ఇదో కొత్త రకం కథ. కథనం మాత్రం అన్ని స్పోర్ట్స్ సినిమాల్లాగే ఉన్నా ఎమోషన్ ని బాగా రాసుకున్నారు. దర్శకుడు శరన్ శర్మ గుంజన్ సక్సేనా తర్వాత మరోసారి జాన్వీతో చేసి సక్సెస్ అయ్యాడు. ఇక కరణ్ జోహార్ సినిమా నిర్మాణ విలువలు బాగానే ఉంటాయని తెలిసిందే.

మొత్తంగా ‘మిస్టర్ & మిసెస్ మహీ’ సినిమా తను క్రికెట్ లో ఫెయిల్ అవ్వడంతో భార్య ట్యాలెంట్ ని గుర్తించి క్రికెటర్ గా చూడాలనుకునే భర్త కథని ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.