35 ఏళ్ల తర్వాత సినిమా.. పొలిటికల్ ఫ్రెండ్‌షిప్ ఫిక్సా?
రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ సినిమాతో ఎటువంటి సంకేతాలిస్తారా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ సినిమాతో ఎటువంటి సంకేతాలిస్తారా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ దాదాపు 35 సంవత్సరాల తర్వాత కలిసి తెరపంచుకోబోతున్నారా.. ఈ లెజండరీ నటులిద్దరూ కలిసి తమిళ రాజకీయాల్లో పెను మార్పు తీసుకురానున్నారా.. గతకొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో, సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు.. తలెత్తున్న సందేహాలు ఇవి.. ప్రముఖ దర్శకులు కె. బాలచందర్.. రజనీ, కమల్ ఇద్దరినీ వెండితెరకు పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో వీళ్లిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. తర్వాత ఇద్దరికీ స్టార్ డమ్ వచ్చింది.
సూపర్ స్టార్‌గా రజనీ, యూనివర్సల్ స్టార్‌గా కమల్ తమిళనాట జెండా పాతారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీ చైనా, జపాన్, మలేషియా వంటి దేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రయోగం అంటే కమల్.. కమల్ అంటే ప్రయోగం అనేంతగా తను పోషించే పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కమల్. ఇటీవల కాలంలో ఈ స్టార్‌లిద్దరు రాజకీయాల వైపు మొగ్గు చూపారు. కమల్ ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే పార్టీని స్థాపించారు.
రజనీ రాజకీయాల్లోకి వస్తారు అనే మాట ఎప్పటినుండో వినబడుతుంది. కొంతకాలంగా ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మొదట్లో రాజకీయాల పరంగా రజనీ, కమల్ మధ్య ఓ మోస్తరు కోల్డ్ వారే జరిగింది. అయితే అన్నాడీఎంకే, డీఎంకేలను ధీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలంటే ఇద్దరూ ఏకమై ఎన్నికల బరిలో దిగకతప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ దశలో కొందరు రజనీ, కమల్ మధ్య రాజకీయ రాజీకి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇప్పుడు ఇంకో మాట కూడా వినిపస్తుంది.. ఇన్నాళ్లూ మల్టీ స్టారర్ చేయమంటే సరైన కథ దొరకాలి అని చెప్పిన రజనీ, కమల్ ఇప్పుడు కలిసి నటించాలని డిసైడ్ అయ్యారు అంటే ఈ సినిమా ద్వారా రాజకీయంగా తాము కలిసి ప్రయాణించనున్నట్టు సంకేతాలివ్వనున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ వీరిద్దరి ఇమేజ్‌కి తగ్గట్టు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కథ తయారుచేసి వినిపించగా రజనీ, కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కమల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’, రజనీ తన 168వ సినిమాలతో బిజీగా ఉన్నారు.