VR టెక్నాలజీతో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్‌ల పెళ్లి సందడి

బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి మరి కొన్ని గంటల్లో ఒకింటి వాడు కాబోతున్నాడు. రానా రేంజ్‌కు అట్టహాసంగా వివాహ వేడుక చేయగలిగినా.. కరోనా భయంతో కీలకమైన జాగ్రత్తల మధ్య వేడుకను నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8.45 నిమిషాలకు పెళ్లి ముహూర్తం కాగా ఇప్పటికే వేడుకలు మొదలైపోయాయి.
రామానాయుడు స్టూడియోలో కరోనా నేపథ్యంలో కట్టు దిట్ట మైన భద్రతా చర్యలతో జాగ్రత్తపడ్డారు. స్టూడియోలోకి ప్రవేశించాలంటే మై గేట్ యాప్ ద్వారా అనుమతి కావాలసిందే. లోపలకు వెళ్లాలాంటే థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజేషన్ తప్పని సరి.
ఈవెంట్ కు వర్షం ఆటంకం కలిగించకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్ తో వధువు మిహీక సిబ్బంది డెకరేషన్ చేశారు. ముందుగానే రానా మిహిక కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి పెళ్లికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరుకానున్నారు.
వధువరుల కుటుంబ సభ్యులు, పరిమిత అతిథుల మధ్య కొన్ని గంటలలో జరుగనున్న రానా పెళ్లికి ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు. అతిథులను వేడుకకు ఆహ్వానించకుండా వారికి వర్చువల్ రియాలిటీ కిట్స్ పంపి పెళ్లిని ఇంటినుంచి చూసే విధంగా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 150 మంది గెస్ట్ లకు VR కిట్స్ పంపిణీ చేశారు. సామాజిక దూరం, కరోనా నిబంధనలు నేపథ్యంలో పెళ్లిని తమ స్టూడియోలోనే జరిపించాలని ప్లాన్ చేసినట్లు సురేశ్ బాబు వెల్లడించారు.