Kantara Chapter 1 Review : ‘కాంతార ఛాప్టర్ 1’ మూవీ రివ్యూ.. కాంతార ప్రీక్వెల్ ఎలా ఉందా?
కాంతార ప్రీక్వెల్ అని ఆ ప్రదేశం గురించి చెప్పడానికి ఓ కథని రాసుకున్నారు. (Kantara Chapter 1 Review)

Kantara Chapter 1 Review
Kantara Chapter 1 Review : మూడేళ్ల క్రితం సూపర్ హిట్ అయిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార ఛాప్టర్ 1 సినిమా తెరకెక్కింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా జయరాం, గుల్షన్ దేవయ్య.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. కాంతార ఛాప్టర్ 1 సినిమా నేడు అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.(Kantara Chapter 1 Review)
కథ విషయానికొస్తే.. కాంతార సినిమా ముగిసిన దగ్గరే ఈ సినిమా మొదలవుతుంది. దైవంలో తన తండ్రి కలిసిపోవడంతో పిల్లాడు అడగడంతో ఆ కాంతార ఊరు కథ చెప్తారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం బాంగ్రా అనే రాజ్యం దగ్గర్లో అడవిలో కాంతార అనే ప్రదేశం, పక్కనే ఈశ్వరుని పూదోట అనే ప్రదేశం ఉంటాయి. బాంగ్రా రాజు కాంతార కి మసాలా దినుసుల సంపదని దోచుకోడానికి వెళ్లి చనిపోవడంతో అక్కడ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని అటు వెళ్ళకూడదు అని, అది ఈశ్వర గణాలు ఉండే స్థలం అని అందరికి భయం పుడుతుంది. ఆ ఘటనలో రాజు కొడుకు రాజశేఖరుడు(జయరాం) చిన్నపిల్లాడు కావడంతో బతికిపోతాడు.
కొన్నేళ్ల తర్వాత రాజశేఖరుడు తన కొడుకు కులశేఖర(గుల్షన్ దేవయ్య)కి రాజ్యం అప్పచెప్తాడు. కానీ కులశేఖర ఎప్పుడూ మందులో మునిగితేలుతూ పట్టించుకోడు. కాంతారలో ఓ తెగ ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతుంటారు. కులశేఖరకు కాంతారకు వెళ్ళొద్దని చెప్తే అటే సైనికులతో వేటకు వెళ్లి ఆ తెగ చేతిలో సైనికులు చనిపోవడంతో వెన్కక్కి తిరిగి వచ్చేస్తారు. దీంతో తెగలో యువ నాయకుడు బెర్మి(రిషబ్ శెట్టి) బయటి ప్రపంచానికి వెళ్లాలని ఓ సైనికుడి సహాయంతో, కొంతమందిని తీసుకొని బాంగ్రాలోకి అడుగుపెడతాడు. అక్కడ వీళ్ళు చేసిన పనులకు పట్టుబడటంతో వీళ్ళు కాంతార నుంచి వచ్చామని చెప్పడంతో అంతా భయపడతారు. మరి కాంతార ప్రజలు బెర్మికి వెళ్తే అక్కడ ఏం జరిగింది? యువరాణి కనకవతి(రుక్మిణి వసంత్) బెర్మికి ఎలా పరిచయం అవుతుంది, అది ఎటు దారి తీస్తుంది? కాంతార, ఈశ్వరుని పూదోట లను రాజశేఖరుడు, కులశేఖర కాకుండా ఇంకెవరు చేజిక్కించుకోవాలని చూస్తారు? కాంతార జనాలకు వచ్చిన ముప్పేంటి? అసలు బెర్మి ఎవరు? అతను కాంతారని, ప్రజలని ఎలా కాపాడతాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
కాంతార సినిమా అంతా రొటీన్ ఉన్నా అదిరిపోయే క్లైమాక్స్ ఉండటంతో సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో కాంతార ప్రీక్వెల్ అని ఆ ప్రదేశం గురించి చెప్పడానికి ఓ కథని రాసుకున్నారు. కాంతార, ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, బందర్ పోర్ట్, అక్కడి ప్రజలు.. ఇలా అన్ని ఫస్ట్ హాఫ్ లో బాగానే సెటప్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువగా కామెడీ మీదే సాగుతుంది. ఆ కామెడీ రొటీన్ అనిపిస్తుంది. కాకపోతే వందల ఏళ్ళ క్రితం సెటప్ తో చూపించారు. కథ చెప్పడానికి ఏం లేదు అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడే కొన్ని కామెడీ సీన్స్, లవ్ సీన్స్ తో తిరుగుతుంది. ఇంటర్వెల్ కి అసలు కథ మొదలవుతుంది.
ఇక సెకండ్ హాఫ్ అంతా దేవుడికి లింక్ పెట్టి నడిపిస్తారు. ఆ డివోషనల్ సీన్స్ అన్ని బాగుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు, రాబోయే సీన్స్ అన్ని ఊహించేయొచ్చు. ఇక క్లైమాక్స్ అరగంట అదిరిపోయేలా చూసుకున్నారు. క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చూస్తే బాహుబలి లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. అసలు హీరో బెర్మి పాత్ర ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనేదానికి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీని క్యూట్ గానే చూపించారు. అప్పట్లో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వస్తు మార్పిడి వ్యాపారం, రాజుల రాజ్యం,అడవుల్లో గ్రామం.. లాంటివి పర్ఫెక్ట్ గా చూపించారు. కథ పరంగా చాలా రొటీన్ కథే. ఓ రాజు, ఇంకొంతమందికి ఒక గ్రామం మీద, ఆ గ్రామంలో దొరికే సంపద మీద కన్ను పడుతుంది. అది చేజిక్కించుకోడానికి వీళ్ళేం చేసారు, ఆ గ్రామం వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనే రొటీన్ కథకు దైవత్వం జోడించి కొత్తగా చూపే ప్రయత్నం చేసారు. చివర్లో కాంతార చాప్టర్ 2 అంటూ సీక్వెల్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.(Kantara Chapter 1 Review)
నటీనటుల పర్ఫార్మెన్స్..
రిషబ్ శెట్టి ఇప్పటికే తన నటనతో ప్రూవ్ చేసుకున్నాడు. మరోసారి ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని చెప్పొచ్చు. రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అందంగా అలరిస్తూనే నటనతో, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది. జయరాం మహారాజు పాత్రలో బాగా మెప్పించారు. యువరాజు పాత్రలో గుల్షన్ దేవయ్య కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో ఒదిగిపోయి బాగా నటించారు.
Also See : OG Success Meet : ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సక్సెస్ మీట్.. ఫొటోలు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పర్వాలేదు. అడవుల్లో మంచి లొకేషన్స్ లో షూటింగ్ చేసారు. అడవుల్లో, ఖాళీ ప్రదేశాల్లో సెట్స్ వేసి అప్పటి రాజుల కాలం లుక్ తీసుకురావడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడ్డారు. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలానికి తగ్గట్టు డ్రెస్ లు బాగా డిజైన్ చేసారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ కట్ చేసి సాగతీత తగ్గిస్తే బాగుండేది. కథ, కథనం రొటీన్ అయినా డివోషనల్ టచ్ ఇచ్చి చూపించారు. రిషబ్ శెట్టి ఓ పక్క అద్భుతంగా నటిస్తూనే మరో పక్క దర్శకుడిగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కాంతార ప్రదేశం గురించి, అక్కడి దైవత్వం గురించి చెప్తూ కామెడీ డివోషనల్ గా తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.