RBI New Rules : ఇక లోన్ ఏజెంట్ల బెదిరింపులకు చెక్.. బ్యాంకు లోన్లు తీసుకున్నవారికి RBI అండగా, కొత్త నిబంధనలివే!
రుణ రికవరీ విషయంలో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. ఏజెంట్లు రుణగ్రహీతల ప్రైవసీని గౌరవించాలి. అవసరమైతే గంటల తరబడి సంప్రదింపులు జరపండి. అనుచిత సందర్భాలలో రికవరీ కాల్స్ చేయడం, ఇళ్లకు వెళ్లొద్దు.
RBI New Rules ( Image Credit : Google Gemeni AI )
- రుణ రికవరీ నియమాలను రూపొందించిన ఆర్బీఐ
- మార్చి 6, 2026 నాటికి ప్రజల అభిప్రాయాల సేకరణ
- రుణగ్రహీతలు, సర్టిఫైడ్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తన నియమావళి తప్పనిసరి
- జూలై 1, 2026 నుంచి రానున్న కొత్త ఆదేశాలు
RBI New Rules : లోన్లు తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై లోన్ల రికవరీ విషయంలో ఆందోళన అవసరం లేదు. రుణగ్రహీతల కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నియమ నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. లోన్ తీసుకున్నాక చెల్లించలేదనే కారణంతో రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలపై అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇకపై రుణ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
2026 ఫిబ్రవరి 12న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) రుణాల వసూళ్లలో పారదర్శకత, న్యాయపరమైన అంశాల కోసం కీలకమైన ముసాయిదా సవరణ ఆదేశాలను విడుదల చేసింది. అనేక సందర్భాల్లో రుణగ్రహీతలు రికవరీ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇకపై ఆర్బీఐ నియమాల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్బీఐ ఈ ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణగ్రహీతలతో ఇకపై రికవరీ ఏజెంట్లు, బ్యాంకులు మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించడం తప్పనిసరి.
ఏజెంట్ల విషయంలో సంస్థలదే బాధ్యత :
అంతేకాదు.. బెదిరింపులు, అనుచిత ఒత్తిళ్లు చేయడం కుదరదు. రికవరీ ఏజెంట్లకు సరైన టైనింగ్, మానిటరింగ్ ఉండాలి. ఏజెంట్ల ప్రవర్తనకు సంబంధించి సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా లోన్ల వసూళ్లు, రికవరీ ఏజెంట్ల నియామకం, సెక్యూరిటీ, స్వాధీనం వంటి అంశాలపై ప్రతి బ్యాంకు స్పష్టమైన విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి :
ఆర్బీఐ రూపొందించిన ఈ ముసాయిదాపై ప్రజలతో పాటు వాటాదారులు 2026 మార్చి 6లోపు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. తుది ఆదేశాలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నియమాలతో రుణగ్రహీతలకు రక్షణతో పాటు రుణ వసూళ్లు క్రమబద్ధంగా, న్యాయంగా మారనుంది.
రికవరీ ఏజెంట్లకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి :
లోన్లు వసూళ్ల కోసం రికవరీ ఏజెంట్లను పంపే ముందు ప్రతి బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) సూచించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రికవరీ ఏజెంట్లను నియమించే ముందు బ్యాంకులు ఆయా ఏజెంట్ల బ్యాక్ గ్రౌండ్, నైతికత, అర్హతలను (డ్యూ డిలిజెన్స్) క్లియర్గా చెక్ చేయాలి.
అంతేకాదు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) అందించే డెట్ రికవరీ ట్రైనింగ్ పూర్తి చేసి సర్టిఫికేట్ పొందినా లేదా IIBFతో అనుబంధం ఉన్న ఇతర సంస్థ ద్వారా ట్రైనింగ్ పొందినట్టు బ్యాంకు కన్ఫార్మ్ చేయాలి.
ముఖ్యంగా బ్యాంకు రికవరీ ఏజెంట్లు, వసూళ్ల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలి. అలాగే, రుణగ్రహీతలతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించేలా చూడాలి. లోన్ రికవరీ ప్రాసెస్ మొత్తం సమయంలో రుణగ్రహీతలకు న్యాయమైన విధంగానే వ్యవహరించాలి.
ఆ డేటా ఏజెంట్లకు పూర్తిగా ఇవ్వొద్దు :
లోన్ పొందిన వారి వ్యక్తిగత సమాచారాన్ని ఏజెంట్లకు పూర్తిగా ఇవ్వొద్దు. ఒకవేళ లోన్ తీసుకున్న కస్టమర్లు ఫిర్యాదు చేసి ఉంటే ఆ ఫిర్యాదు పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకు ఆ కేసును రికవరీ ఏజెంట్లకు అప్పగించకూడదు.
రుణ వసూళ్ల కోసం బ్యాంకు రాతపూర్వక నోటీసులు, ఫోన్ రిమైండర్లు, బ్యాంకు అధికారులు వెళ్లి అడగొచ్చు. కానీ, అది కూడా మర్యాదపూర్వకంగానే వెళ్లి అడగాల్సి ఉంటుంది. రుణగ్రహీతల ఇళ్ల వద్దకు వారు సూచించిన సమయాల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అంతేకానీ, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లకూడదు. రుణగ్రహీతల ప్రైవసీని గౌరవించడం అత్యంత ముఖ్యంగా ఆర్బీఐ పేర్కొంది.
వసూళ్ల పేరుతో బెదిరింపులు వద్దు :
బ్యాంకు లోన్లు తీసుకున్న వారిని వసూళ్ల పేరుతో ఎలాంటి బెదిరింపులకు పాల్పకూడదు. అవమానకరంగా ప్రవర్తించకూడదు. కమర్షియల్ కమ్యూనికేషన్లకు సంబంధించిన నిబంధనల విషయంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలి.
ప్రధానంగా 2018లో ప్రవేశపెట్టిన కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ వంటి నిబంధనలను సైతం బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ నియమాలను రుణ వసూళ్ల ప్రక్రియను పారదర్శకంగా ఉండాలి. రుణగ్రహీతల హక్కులను రక్షించేందుకు ఆర్బీఐ ఈ సవరణలను తీసుకురానుంది.
