Vey Dharuvey : ‘వెయ్ దరువెయ్’ మూవీ రివ్యూ.. సాయిరామ్ శంకర్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉంది?

సాయిరామ్ శంకర్ లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తూ ‘వెయ్ దరువెయ్’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Vey Dharuvey : ‘వెయ్ దరువెయ్’ మూవీ రివ్యూ.. సాయిరామ్ శంకర్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉంది?

Sai Raam Shankar Re Entry Movie Vey Dharuvey Review

Vey Dharuvey : హీరో సాయిరామ్ శంకర్(Sai Raam Shankar) లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తూ ‘వెయ్ దరువెయ్’ అనే సినిమాతో నేడు మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై దేవరాజ్ పోతూరు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ భామ యష శివకుమార్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా, హెబ్బా పటేల్(Hebah Patel) ఓ స్పెషల్ సాంగ్ లో మెరిపించింది.

కథ విషయానికొస్తే.. కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్) బి.టెక్ బ్యాక్ లాగ్స్ తో ఖాళీగా తిరుగుతుండటంతో హైదరాబాద్ లో ఉన్న తన మామ(సత్యం రాజేష్) దగ్గరికి జాబ్ కోసం వెళ్తాడు. హైదరాబాద్ కి వెళ్లగానే శృతి(యశ శివకుమార్) కనిపించడంతో ఆమె వెనక పడతాడు. శృతి మాత్రం అతనితో బట్టల షాప్ లో పదివేల బిల్లు కట్టించి మాయమైపోతుంది. జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే ఫేక్ సర్టిఫికెట్స్ ఇస్తే జాబ్స్ వస్తాయని ఓ ఫ్రెండ్ చెప్పడంతో ఫేక్ సర్టిఫికెట్స్ కోసం వెళ్లగా అక్కడ శృతి కనిపిస్తుంది. సర్టిఫికెట్ కోసం లక్షల్లో డబ్బులు అడుగుతారు. దీంతో ఓ రౌడీ(ప్రభాస్ శీను) దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకుంటాడు శంకర్. ఆ డబ్బు కట్టి కొన్ని రోజుల తర్వాత సర్టిఫికెట్స్ కోసం వెళ్లగా అదే సమయంలో పోలీసులు ఫేక్ సర్టిఫికెట్స్ అమ్ముతున్నారని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో డబ్బుల కోసం రౌడీ శంకర్ మామని తీసుకెళ్లి కిడ్నీలు అమ్మేస్తా అంటాడు.

శంకర్ ఆ డబ్బులు ఎలా తిరిగి కట్టాడు? ఈ ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల శంకర్ కి జరిగిన నష్టం ఏంటి? శంకర్ – శృతి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అసలు శంకర్ హైదరాబాద్ కి ఎందుకు వస్తాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. నకిలీ సర్టిఫికెట్స్ కథాంశంతో గతంలో కూడా పలు సినిమాలు వచ్చాయి. ఈ వెయ్ దరువెయ్ సినిమా కూడా అదే కథతో వచ్చిందే. అయితే వెయ్ దరువెయ్ సినిమాని మొదటి నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించి లాస్ట్ అరగంట మాత్రం ఎమోషనల్ సీన్స్ తో మెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా సాయిరామ్ శంకర్ హైదరాబాద్ రావడం, హీరోయిన్ తో సన్నివేశాలు, సత్యం రాజేష్ తో కామెడీ సీన్స్, ఫేక్ సర్టిఫికెట్స్ కోసం శంకర్ వెతకడం.. సీన్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు రివీల్ చేసి, చివర్లో మంచి ఎమోషన్ తో నడిపిస్తారు.

చదువుకోకుండా అడ్డదారుల్లో ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు చేస్తూ అనేక నష్టాలకు కారణమయ్యే వాళ్ళు ఏదో ఒకరోజు దొరక్కపోరు అంటూనే, నిరుద్యోగులని క్యాష్ చేసుకోవడానికి వారికి ఫేక్ సర్టిఫికెట్స్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల పోయిన ప్రాణాలు, కూలిన బ్రిడ్జిలు.. ఇలా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని ఓ మెసేజ్ ఇచ్చారు.

Also Read : Tantra Movie Review : తంత్ర మూవీ రివ్యూ.. అనన్య నాగళ్ళ భయపెట్టిందా..?

నటీనటుల విషయానికొస్తే.. 2017 తర్వాత ఆల్మోస్ట్ ఏడేళ్ల గ్యాప్ తీసుకొని వెయ్ దరువెయ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సాయిరామ్ శంకర్. ఒకప్పుడు సాయిరామ్ శంకర్ సినిమాలు అంటే ఫుల్ ఎనర్జీతో ఉండేవి. ఇండస్ట్రీలో రవితేజ, నిఖిల్.. లాగా అంత ఎనర్జీ చూపించే హీరో సాయి రామ్ శంకర్. ఇంత గ్యాప్ వచ్చినా ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. యాక్టింగ్ చాలా యాక్టివ్ గా చేసాడు. కన్నడ భామ యశ శివకుమార్ కి నటనకి స్కోప్ లేకపోయినా తన అందంతో అక్కడక్కడా మెప్పించింది. సత్యం రాజేష్ మామ పాత్రలో నవ్విస్తాడు. సునీల్, ఈ చిత్ర నిర్మాత దేవరాజ్ పోతూరి విలన్స్ గా ఓకే అనిపించారు. గాయత్రీ భార్గవి, రోలర్ రఘు, పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనాథ్, శృతి సమన్వి, ప్రభాస్ శీను.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బానే ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ పరంగా పాటలు బాగున్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో అవసరం లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ డామినేట్ గా ఉంది. కథ పాతదే అయినా కథని డైరెక్ట్ గా చెప్పకుండా ట్విస్ట్ లతో రివీల్ చేస్తూ కథనంలో కొత్తగా ట్రై చేసాడు దర్శకుడు. డైరెక్టర్ నవీన్ రెడ్డికి ఇది మొదటి సినిమా అయినా ఓకే అనిపించాడు. చాలామంది సీనియర్ ఆర్టిస్టులని పెట్టుకున్నా బాగా డీల్ చేశారు. చాలా మంది స్టార్ ఆర్టిస్టులు, ఎక్కువ లొకేషన్స్.. ఇలా సినిమా పరంగా నిర్మాత ఖర్చు కూడా బాగానే పెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తానికి వెయ్ దరువెయ్ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫేక్ సర్టిఫికెట్స్ అనే సమస్య గురించి ప్రస్తావించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..