జనాభాను తగ్గించాలనుకుంటున్నారా?.. వైరస్ చైనా పనే..

  • Published By: Mahesh ,Published On : April 16, 2020 / 06:07 PM IST
జనాభాను తగ్గించాలనుకుంటున్నారా?.. వైరస్ చైనా పనే..

Updated On : April 16, 2020 / 6:07 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుండగా నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి అనవసరంగా వస్తున్న వారిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని, అందరు ఇళ్లకే పరిమితం కావాలని సూచించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు భాయ్ జాన్. 
‘మీరు దేశ జనాభాను తగ్గించాలనుకుంటున్నారా? ఈ పనిని మీ కుటుంబంతోనే మొదలు పెట్టాలనుకుంటున్నారా? డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు తమ జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వాళ్లపై రాళ్లు విసిరితే మీ ప్రాణాలను ఎవరు కాపాడతారు? ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోనే చేసుకోండి. బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెడుతున్నారు?’ అని ప్రశ్నించాడు. అలాగే ప్రజలను పోలీసులు కొట్టడంపై స్పందిస్తూ.. ‘ఇంట్లో ఉన్న వారిని పోలీసులు కొట్టడం లేదు కదా..’ అని సమాధానమిచ్చాడు. ఇక, కరోనా పాజటివ్‌ వ్యక్తులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘వారు చావడానికి వెళ్తున్నారా లేక బతకడానికి వెళ్తున్నారా’ అని ప్రశ్నించాడు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ కరోనా మహమ్మారిని చైనా కావాలనే ప్రపంచం మీదకు వదిలింది అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది మానవాళి మనుగడకే సవాల్‌ విసురుతోంది. దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. కాగా నిఖిల్ కరోనాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘చైనాలోని వూహాన్‌ నగరంలో కరోనావైరస్‌ మొదటిసారి బయటపడింది. దీంతో అప్రమత్తమైన చైనా జనవరిలో వూహాన్‌ నగరం నుంచి ఇతర నగరాలకు డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌తో పాటు ఇతర రవాణాలను నిలిపివేసింది. కానీ వూహాన్‌ నగరం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం అనుమతి ఇచ్చింది. చైనా ఉద్దేశ పూర్వకంగా ఈ వైరస్‌ను ప్రపంచం మీదకి వదలకపోతే.. వూహాన్‌ నుంచి అంతర్జాతీయ విమానాలను ఎందుకు నడిపింది’’.. అంటూ నిఖిల్‌ సందేహం వ్యక్తం చేశాడు.