హాస్పిటల్ నుంచి సంజయ్ దత్ డిశ్చార్జ్..

  • Publish Date - August 10, 2020 / 05:22 PM IST

శ్వాస సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చింది. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని నిర్ణయం తీసుకున్న సంజయ్ దత్ సోమవారం హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.



హాస్పటల్‌లో జాయిన్ అయిన రోజు.. ‘‘నేను బాగానే ఉన్నాను. ప్ర‌స్తుతం వైద్యుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌‌లో ఉన్నాను. లీలావ‌తి ఆసుప‌త్రిలోని వైద్యులు, న‌ర్సులు, సిబ్బంది స‌హాయ స‌హ‌కారాల వ‌ల్ల రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి చేరుకుంటాను. మీ అభిమానానికి, ఆశీర్వాదాల‌కు ధ‌న్య‌వాదాలు’’ అని సంజయ్ దత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లే క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.



‘‘శ్వాస సమస్యతో ఆగస్ట్ 8న లీలావతి హస్పటల్‌లో జాయిన్ అయిన నటుడు సంజయ్ దత్.. వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సోమవారం ఇంటికి చేరుకున్నారు..’’ అని లీలావతి హాస్పటల్ అధికారిక వర్గాలు ప్రకటించాయి. సంజయ్ దత్ డిశ్చార్జ్ అయ్యారనే వార్త తెలియగానే సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.