తండ్రి మరణం.. శరణ్య ఇంట విషాదం..

Saranya’s Father Passes away: తమిళ్, తెలుగు చిత్రాల్లో తల్లి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడు ఆంటోనీ భాస్కర్ రాజ్(95) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లో కూతురు శరణ్య ఇంట్లో ఉన్న ఆయనకు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సినిమా పరిశ్రమలో ఏబీ రాజ్‌గా ఆయన సుపరిచితులు.. కాగా 70కు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఏబీ రాజ్ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తమిళనాడులోనే జరిగింది. తొలుత శ్రీలంకలో దర్శకుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఆ తర్వాత మలయాళం పరిశ్రమలో అడుగు పెట్టారు. అక్కడ స్టార్ హీరోలతో కలిసి పలు హిట్ సినిమాలు నిర్మించిన ఆయన తమిళంలోనూ సినిమాలు రూపొందించారు. ఏబీ రాజ్ మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.