Narudi Brathuku Natana : ‘నరుడి బ్రతుకు నటన’ మూవీ రివ్యూ.. జీవితం గురించి తెలుసుకోవాలన్న యాక్టర్..
'నరుడి బ్రతుకు నటన' సినిమా యాక్టర్ కావాలనుకునే ఓ డబ్బున్న వ్యక్తి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు అని అందంగా చూపించారు.

Shiva Kumar Nithin Prasanna Narudi Brathuku Natana Movie Review and Rating
Narudi Brathuku Natana Movie Review : శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మాణంలో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శృతి జయన్, ఐశ్వర్య, వైవా రాఘవ్, దయానంద్ రెడ్డి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. నరుడి బ్రతుకు నటన సినిమా నేడు అక్టోబర్ 25న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ఓ బాగా డబ్బున్న వ్యక్తి కొడుకు సత్య(శివ కుమార్). సత్య యాక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న(దయానంద్ రెడ్డి) పేరు ఉపయోగించి, సొంతంగా కూడా వెళ్లి ఆడిషన్స్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి సమయంలో సత్యకు యాక్టింగ్ రాదు అని, వరస్ట్ యాక్టింగ్ అని వాళ్ళ నాన్న, ఓ అసిస్టెంట్ డైరెక్టర్, అతని క్లోజ్ ఫ్రెండ్(వైవా రాఘవ్) కూడా అంటారు. సత్య ఫ్రెండ్.. లైఫ్ లో ఎమోషన్స్ లేకుండా యాక్టింగ్ లో ఎమోషన్స్ రావు, జీవితం అంటే ఏంటో నీకు తెలియదు అని క్లాస్ పీకడంతో సత్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు.
అలా ఇల్లు వదిలేసిన సత్య కేరళ వెళ్లి తన దగ్గరున్న డబ్బులు అన్ని అయిపోవడంతో రోడ్డు మీద పడతాడు. అతని ఫోన్ కూడా పోగొట్టుకుంటాడు. డబ్బులు పోయి, ఫోన్ పోయి, తిండి లేక కేరళలోని ఓ పల్లెటూరులో బస్టాప్ లో ఉండగా సల్మాన్(నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ ఊళ్ళో తెలుగు వచ్చిన ఒకే ఒక వ్యక్తి, మంచి వ్యక్తి కావడంతో సల్మాన్ సత్యను తనతో పాటు తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి, ఫుడ్ పెడతాడు. దీంతో సత్య సల్మాన్ తో ఉంటూ అదే ఊర్లో తిరుగుతాడు. ఈ క్రమంలో పక్కింట్లో ఒంటరిగా ఉండే ప్రగ్నెంట్ లేడి లేఖ(శృతి జయన్)ని ఇష్టపడతాడు సత్య. మరి సత్య జీవితంలో ఏం నేర్చుకున్నాడు? ప్రగ్నెంట్ లేడీని ఎందుకు ఇష్టపడతాడు? ప్రగ్నెంట్ లేడీ ఎందుకు ఒంటరిగా ఉంది? అసలు మలయాళ వ్యక్తి సల్మాన్ కి తెలుగు ఎలా వచ్చింది? సల్మాన్ కథ ఏంటి? సత్య యాక్టర్ అయ్యాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Pottel : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ.. కథ మంచిదే.. కానీ కథనమే..
సినిమా విశ్లేషణ.. సాధారణంగా జీవితం గురించి చెప్పే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. కమల్ హాసన్ సత్యం శివమ్ సినిమాని ప్రేరణగా తీసుకొని ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించినట్టు ఉంది. సినిమాలో కూడా కమల్ హాసన్ కి సంబంధించిన సీన్స్ ప్రేక్షకులని మెప్పిస్తాయి. యాక్టర్ అవ్వాలన్న ఓ వ్యక్తి తనకు యాక్టింగ్ రాదు అనే విమర్శలు ఎదుర్కొన్నాక యాక్టింగ్ కోసం, ఎమోషన్స్ కోసం, అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి అని మొదలుపెట్టిన ప్రయాణంలో అతను ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అని చూపించారు.
90 శాతం సినిమా కేరళలోని ఓ పల్లెటూరులోనే తీశారు. కేరళ అందాలను అక్కడి మనుషులను చాలా బాగా చూపించారు. కథ కేరళలో జరిగినా, అక్కడక్కడా మలయాళం మాట్లాడినా అందరికి అర్ధమయ్యే విధంగానే రాసుకున్నాడు దర్శకుడు. ఆడిషన్స్ లో ఏ సన్నివేశాలు చేసి సత్యకు యాక్టింగ్ రాదు అనిపించుకున్నాడో అదే సన్నివేశాలు రియల్ లైఫ్ లో ఎదురైతే ఎంత బాగా తన ఎమోషన్స్ చూపించాడో అని ఆ సీన్స్ ని అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ప్రగ్నెంట్ లేడీతో ప్రేమ కథ కూడా ఆసక్తిగా రాసుకున్నారు. సల్మాన్ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా బాగుంటుంది. కొన్ని సన్నివేశాల్లో సల్మాన్ బాగా నవ్వించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే అనేక అవార్డులు గెలుచుకుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్స్ లో నటిస్తూ వస్తున్న శివ కుమార్ రామచంద్రవరపు నరుడి బ్రతుకు నటనలో స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఓ యాక్టర్ గా మెయిన్ లీడ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పటివరకు నెగిటివ్ రోల్స్ లో సూపర్ అనిపించిన నితిన్ ప్రసన్న ఇందులో మంచి వ్యక్తిగా, కామెడీ పండిస్తూ ఆశ్చర్యపరిచాడు. మలయాళీ భామ శృతి జయన్ ప్రగ్నెంట్ లేడీ పాత్రలో బాగా మెప్పించింది. ఐశ్వర్య, వైవా రాఘవ.. పలువురు కేరళ నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కేరళ లొకేషన్స్ ని ఇంకా అందంగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక సింపుల్ కథని మనసుకు హత్తుకునే విధంగా డైరెక్టర్ చాలా బాగా రాసుకొని తెరకెక్కించాడు. దర్శకుడే ఎడిటర్ కావడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఇలాంటి సినిమాలు నిర్మించాలంటే ఆలోచిస్తారు. కానీ కొత్త నిర్మాతలు అయినా ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. పెద్ద సినిమాలు వరుసగా చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మాణంలో భాగమయి రిలీజ్ చేయడం గమనార్హం.
మొత్తంగా ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా యాక్టర్ కావాలనుకునే ఓ డబ్బున్న వ్యక్తి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు అని అందంగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.