#90’s Review : 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ..
ఆరు ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. రివ్యూ పై ఓ లుక్ వేసేయండి.

Sivaji 90s A Middle Class Biopic web series complete telugu review
#90’s Review : శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత శివాజీ నుంచి వస్తున్న సిరీస్ కావడంతో ఆడియన్స్ లో మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఆరు ఎపిసోడ్స్ తో ఈటీవీ విన్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. రివ్యూ పై ఓ లుక్ వేసేయండి.
కథ విషయానికొస్తే..
అలా మొదలయ్యి ఇలా ముగిసిందని చెప్పడానికి ఇది కథ కాదు. టైటిల్ లోనే చెప్పారు కదా ‘బయోపిక్’ అని. ఈక్రమంలోనే ప్రతి మిడిల్ క్లాస్ కి సంబంధించిన అనుభవాలు, పాత్రలు ఈ సిరీస్ లో కనిపిస్తాయి. ముందుగా నాన్న పాత్ర.. పైకి కఠినంగా కనిపించినా లోపల కుటుంబం గురించి ఎంతో భయంపడే పిరికితనం. అమ్మ పాత్ర.. లోపల ఎంతో భయపడుతున్నా భర్తకి సైతం ధైర్యం చెప్పే బలం, కుటుంబంలో ఏ ఒక్కరు తినకపోయినా తాను అలకపాన్పు ఎక్కే అమాయకత్వం. ఇంక పిల్లలు.. కంపారిషన్స్, రిస్ట్రిక్షన్స్, పేరెంట్స్ కోపం వెనుక ఉన్న ప్రేమ తెలుసుకోలేని తెలివి, మొదటి ప్రేమ కథలు.
సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఈ వెబ్ సిరీస్ కథ. అలాగే ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ కి పాఠాలోని భావం తెలపకుండా, ర్యాంకుల కోసం పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తీసుకువస్తున్నాయి, ఆడపిల్లలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, జాగ్రత్త అని చెపుతూ పేరెంట్స్ పిరికితనం నింపుతున్నారు.. అనే సోషల్ అంశాలను కూడా చాలా చక్కగా చూపించారు.
వెబ్ సిరీస్ విశ్లేషణ..
ముందుగా చెప్పినట్లు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి.. ఇదేమి ఫాంటసీ కథ కాదుగా, ఒక అద్భుతమైన బయోపిక్. దర్శకుడు ఆదిత్య హాసన్ 90s థీమ్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. ల్యాండ్ ఫోన్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఒకరి సైకిల్స్, బట్టలు మరొకరికి ఇవ్వడం, తెచ్చుకున్న మటన్ కూరలో చిన్న పీస్ కూడా వేస్ట్ కాకూడదు, ముఖ్యంగా అమృతం, పంచతంత్రం, ఈటీవీ వార్తలు.. ఇవన్నీ 90s డేస్ ని కళ్ళకి కట్టినట్లు చూపించారు.
ముందు మూడు ఎపిసోడ్స్ కొంచెం ఎంటర్టైన్ గా సాగుతుంది. నెక్స్ట్ మూడు ఎపిసోడ్స్ ఎమోషనల్ గా రన్ అవుతాయి. ముఖ్యంగా అమ్మానాన్న పాత్రలు, స్కూల్ పరిస్థితులు 90s కిడ్స్ గుండెకు హత్తుకునేలా, ఒకసారి మళ్ళీ ఆ జ్ఞాపకాల్లో మునిగి తేలేలా చేస్తుంది.
నటీనటులు..
తండ్రిగా, మాథ్స్ టీచర్ గా శివాజీ జీవించేశారు అనే చెప్పాలి. పైకి కఠినత్వం చూపిస్తూనే లోపల భయపడే మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ ని చాలా సెటిల్డ్ గా చేశారు. నిజంగా చెప్పాలంటే శివాజీకి ఇది సెకండ్ ఇన్నింగ్స్. ఇంక అమ్మగా, హౌస్ వైఫ్‌గా నటించిన వాసుకీ.. తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చెల్లి పాత్రలో చాలా సహజంగా నటించి ఇప్పటికి సిస్టర్ పాత్ర అంటే అలా ఉండాలి అనిపించేలా చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ లో అమ్మ పాత్రని కూడా అలాగే చేశారు. పిల్లలు తినకుండా వెళ్లారని ఆమె అలిగే సీన్ ప్రతిఒక్కరిని ఎమోషనల్ చేసేస్తుంది.
ఆ తరువాత పెద్ద కొడుకుగా నటించిన రఘు తేజ (మౌళి తనూజ్ ప్రశాంత్).. తండ్రి ప్రేమ కోసం తాపత్రయ పడే కొడుకుగా, ఫస్ట్ లవ్, పిరికితనంతో 90s కిడ్‌ని అలా కళ్ళకి కట్టినట్లు చూపించాడు. మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆడపిల్ల ఎదుర్కొనే రిస్ట్రిక్షన్స్, అమ్మతో పాటు ఆ ఆడపిల్ల ఇంటిని సరిదిద్దే పాత్రలో దివ్య (వాసంతిక) చాలా నేచురల్ గా నటించింది. ఇక చివరిగా మూడో కొడుకుగా నటించిన ఆదిత్య (రోహన్ రాయ్). ఈ పాత్ర కూడా ఎంతో మంది 90s కిడ్స్ కి అద్దం పట్టినట్లు ఉంటుంది.
తనకి చదువు ఎలా నేర్పాలని చూడకుండా టీచర్స్ నుంచి పేరెంట్స్ వరకు.. ప్రతి ఒక్కరు తన పై ఒత్తిడి చూపించడం, ఆ ఒత్తిడితో అతడికి చదువు పై ఉన్న ఇంటరెస్ట్ కూడా పోవడం.. వంటి అనుభవాలు ఈ పాత్రలో కనిపిస్తాయి. అలాగే ఇంటిలో చివరి కొడుకు జాలీ లైఫ్ అందర్నీ నవ్వించేలా రోహన్ రాయ్ చాలా చక్కగా చేసాడు. నిజం చెప్పాలంటే.. ఈ సిరీస్ కి రోహన్ రాయ్ నే హీరో అని చెప్పాలి.
ఎలా ఉంది..?
ఇంత చెప్పిన తరువాత ఈ సిరీస్ ఎలా ఉంది అనే ప్రశ్న ఎవరు వెయ్యరు అనుకుంటా. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ తప్పకుండా చూడాల్సిన సిరీస్.
గమనిక : ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.